● ఒకే ఒక్క కూతురి చదువు కోసం
ఊర్లు మారిన తండ్రి హృదయం
● నాన్న త్యాగానికి ప్రతిఫలంగా
అసిస్టెంట్ ప్రొఫెసర్, సమగ్ర శిక్ష ఏపీసీగా నిలిచిన కుమార్తె అనురాధ
సాక్షి, మదనపల్లె : ‘మా నాన్న ఎన్వీ.రమణరావు నా జీవితానికి వెలుగు. నా ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ నాన్నే ఉన్నాడ్ఙు అంటూ అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నున్నా అనురాధ తన తండ్రి త్యాగాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మగబిడ్డలు లేకపోయినా, తనకున్న ఒకే ఒక్క కూతురే సర్వస్వంగా భావించి, ఆమె ఉన్నతి కోసం ఆ తండ్రి తన జీవితాన్నే త్యాగం చేసిన అద్భుతమైన కథనం ఇది.కూతురి చదువు కోసం కాపురాలు మార్చి..ఎన్వీ.రమణరావు దినపత్రికల సర్కులేషన్ విభాగంలో ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేసేవారు. కుమార్తె బీఈడీ చదువు కోసం కావలి వెళ్లాల్సి వస్తే.. ఆమెను వదిలి ఉండలేక తన కాపురాన్ని అక్కడికే మార్చారు. ఆ తర్వాత ఆమె తిరుపతిలో ఎమ్‌ఈడీ చదవాల్సి వచ్చినప్పుడు, మళ్లీ తన నివాసాన్ని తిరుపతికి మార్చారు. కుమార్తె ఎక్కడ చదివితే అక్కడికి మారుతూ, ఒక్కో చోట ఒక్కో సంస్థలో ఉద్యోగం చేస్తూ కష్టపడి ఆమెను చదివించారు.
పట్టుదలతో చదివి.. నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో అనురాధ చదువుల్లో సరికొత్త శిఖరాలను అధిరోహించారు. డిగ్రీ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, ఎమ్‌ఈడీ, ఎమ్‌ఫిల్, చివరకు పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. నాన్న సంతోషం కోసం 2007లో వివాహమైనప్పటికీ ఆమె చదువును ఆపలేదు. ఫలితంగా, 2015లో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించి నాన్న కలను నిజం చేశారు. ‘నన్ను చిన్నప్పటి నుంచి తన ఇంట్లో రాణిలా చూసుకున్న నాన్నను, నాకు ఉద్యోగం వచ్చాక మహరాజులా చూసుకోవాలనుకున్నాను. అందుకే పత్రికలో ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించేశాను’ అని అనురాధ గర్వంగా చెబుతున్నారు. అనురాధ ప్రస్థానం.. ఆడపిల్లల చదువుకు అండగా నిలిచే ప్రతి తండ్రికీ, కన్నవారి కష్టాన్ని గౌరవించే ప్రతి కుమార్తెకూ గొప్ప ఆదర్శం!


