●9 వేల షాపులు.. తనిఖీలు ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

●9 వేల షాపులు.. తనిఖీలు ఎక్కడ?

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

●9 వేల షాపులు.. తనిఖీలు ఎక్కడ?

మందుల షాపులపై కొరవడిన నిఘా: ప్రజల ప్రాణాలతో చెలగాటం

జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు

విరుద్ధంగా మెడికల్‌ స్టోర్ల నిర్వహణ

ఫార్మాసిస్ట్‌లు లేకుండానే

అనర్హుల ఇష్టారాజ్యం

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే

నిషిద్ధ మాత్రల విక్రయం

ఆసుపత్రులకు అనుబంధంగా

రెట్టింపు ధరల దోపిడీ

తనిఖీలు రికార్డులకే పరిమితమన్న విమర్శలు

జిల్లా కలెక్టర్‌ స్పందించి ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ చేపట్టాలని ప్రజల డిమాండ్‌

మదనపల్లె టౌన్‌: ప్రజల ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్న మందుల దుకాణాలపై అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ స్టోర్ల నిర్వహణ యథేచ్ఛగా సాగుతున్నా.. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు మొక్కుబడిగా సాగుతుండటంతో కొందరు మందుల షాపు నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువునా మోసం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

నిబంధనలు గాలికి.. అర్హత లేని వారితోనే మందుల విక్రయాలు

ఔషధ దుకాణం నిర్వహించాలంటే ఫార్మసిస్ట్‌ తప్పనిసరిగా ఉండాలి, లైసెన్స్‌ ప్రదర్శించాలి, స్టాక్‌ రిజిస్టర్‌, బిల్లులు, మందుల నిల్వకు ఉష్ణోగ్రత పాటించడం వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ మదనపల్లె, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలో చాలా చోట్ల ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఫార్మసిస్ట్‌ పేరుతో లైసెన్స్‌ తీసుకుని, అసలు ఫార్మసిస్ట్‌ లేకుండానే అనర్హులు మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది చట్టరీత్యా తీవ్ర నేరం. అర్హత లేని వ్యక్తి ఇచ్చే మందుల వల్ల రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు విక్రయం

వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి అయిన షెడ్యూల్‌ హెచ్‌, హెచ్‌1 కింద వచ్చే యాంటీబయాటిక్స్‌, మత్తు మందులు, నిద్ర మాత్రలను కొన్ని దుకాణాల్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్‌ అడగకుండా ఇవ్వడం వల్ల యువత మత్తుకు బానిసయ్యే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ పెరిగి భవిష్యత్తులో మందులే పనిచేయని పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ దీనిపై అధికారుల నియంత్రణ శూన్యం.

ఆసుపత్రులకు అనుబంధంగా దోపిడీ

ఆసుపత్రులకు అనుబంధంగా రెట్టింపు రేట్లు డబ్బు తీసుకుని మందులు అమ్ముతున్నారు. ఈ దందా ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా నడుస్తున్న మెడికల్‌ స్టోర్లలో మరింత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బయట రూ.100కే దొరికే మందును ఆసుపత్రి లోపలి షాపులో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. రోగి బయట కొనుక్కుంటే డాక్టర్లు ఒప్పుకోరనే భయంతో రెట్టింపు ధర పెట్టి కొనాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. జెనరిక్‌ మందులు రాస్తే చౌకగా వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా, కమీషన్ల కోసం బ్రాండెడ్‌, కాస్ట్లీ మందులే రాస్తున్నారనే విమర్శలున్నాయి.

అధికారుల తప్పిదం – మొక్కుబడి కేసులు

ఈ ఆరోపణలపై మదనపల్లె డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖలందర్‌ను వివరణ కోరగా, నిబంధనల మేరకు తనిఖీలు చేస్తున్నామని, 64 కేసులు నమోదు చేశామని చెప్పడం గమనార్హం. 700 షాపుల్లో కేవలం 64 కేసులు మాత్రమే నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే మిగిలిన 90 శాతం దుకాణాలు పక్కాగా నిబంధనలు పాటిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉల్లంఘనలపై లైసెన్స్‌ రద్దు, భారీ జరిమానా వంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

ప్రజల డిమాండ్‌ – ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి

మందుల విషయంలో నిర్లక్ష్యం నేరుగా ప్రాణాలతో ముడిపడి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ చేపట్టాలని, ఫార్మసిస్ట్‌ లేని షాపుల లైసెన్సులు రద్దు చేయాలని, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు అమ్మే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే పేద ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉంటారు.

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 10వేలకు పైగా ఔషధ దుకాణాలు ఉండగా, ఒక్క మదనపల్లె డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలోనే 700కి పైగా షాపులు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న దుకాణాలను పర్యవేక్షించడానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్న అధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయకపోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తనిఖీలు చేసినా రికార్డులకే పరిమితమవుతున్నాయే తప్ప, గడువు తీరిన మందులు, నకిలీ మందుల నిల్వలు, ఉష్ణోగ్రత పాటించని విధానంపై దృష్టి పెట్టడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement