గంజాయి స్మగ్లర్‌పై పిట్‌ ఎన్డీపీఎస్‌ అస్త్రం | - | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్‌పై పిట్‌ ఎన్డీపీఎస్‌ అస్త్రం

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

మదనపల్లె టౌన్‌: గుర్రంకొండ కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఓ కరుడుగట్టిన స్మగ్లర్‌ ఆటను పోలీసులు కట్టించారు. యువతే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న కలకడ ముబారక్‌ బాషా కుమారుడు కలకడ ఆదిల్‌ (22)పై ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌– 1988 చట్టం (పిట్‌ ఎన్డీపీఎస్‌)ను ప్రయోగించారు. అలాగే గుర్రంకొండ పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఓపెన్‌ చేశారు. మంగళవారం మదనపల్లె జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ వేంకటాద్రితో కలసి అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా గుర్రంకొండకు చెందిన కలకడ ముబారక్‌బాషా కుమారుడు కలకడ ఆదిల్‌ రహస్యంగా గంజాయి అమ్ముతున్నట్లు గుర్రంకొండ పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు.

గతంలో నమోదైన కేసులివే..

ఆదిల్‌పై ఇప్పటివరకు 5 గంజాయి కేసులు నమోదయ్యాయని, గతంలో అతని నుంచి 28 కిలోల గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ వివరించారు. ఇవే కాకుండా దొంగతనాలు, దాడులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరో 5 క్రిమినల్‌ కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిపై తరచూ కేసులు నమోదై అరెస్ట్‌ అవుతున్నా బెయిల్‌పై బయటకు వస్తున్నాడు. అయినా అతని తీరు మారకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుండ డంతో అతని కార్యకలాపాలపై ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇతడు సరఫరా చేస్తున్న గంజాయి వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందని, సమాజానికి ముప్పుగా మారాడని పోలీసుల నివేదిక మేరకు అతడిని పక్కా ‘డ్రగ్‌ అఫెం డర్‌’గా పరిగణిస్తూ ఎస్పీ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. సాధారణ చట్టాలతో ఇతని నేరాలను తక్షణమే నిలువరించడం కష్టమని భావించిన ప్రభుత్వం పీడీ యాక్ట్‌కు సమాన మైన ‘పిట్‌ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌–1988’లోని సెక్షన్‌ 3(1)ని ప్రయోగించింది. జిల్లాలో మాదక ద్రవ్యాలు, కూల్‌ లిప్స్‌ అమ్మినా, రవాణా చేసినా వదిలి పెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కష్ణమోహన్‌, వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ, రవీంద్ర బాబు పాల్గొన్నారు.

ఏటీఎం చోరీ నిందితులను పట్టుకుంటాం

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె ఏటీఎం చోరీ కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. మంగళవారం మదనపల్లి జిల్లా ఎస్పీ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులు హర్యానాకు చెందిన వ్యక్తులే అయి ఉంటారని అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏటీఎంల చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఏటీఎం చోరీ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారని స్పష్టం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని తెలిపారు.

నకిలీ పాస్‌ పుస్తకాల గుట్టురట్టు

నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల తయారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. మదనపల్లెలో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది ఫేక్‌ సీళ్లతో ఎమ్మార్వో సంతకం ఫోర్జరి చేసి, నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. మంగళవారం ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మదనపల్లెలో విలువైన భూములను నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి చేస్తున్న మోసాలపై సోమవారం పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు చేస్తున్న మోసాలపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నట్లు తేలితే రెవెన్యూ అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

గంజాయి స్మగ్లర్‌ కలకడ ఆదిల్‌ అరెస్ట్‌

కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

నిందితుడిపై గుర్రంకొండ పీఎస్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఓపెన్‌: ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement