దొంగల చేతివాటం.. కేబుల్‌ వైర్లు మాయం | - | Sakshi
Sakshi News home page

దొంగల చేతివాటం.. కేబుల్‌ వైర్లు మాయం

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

15 బోరు మోటార్లు వద్ద

కేబుల్‌ తీగలు అపహరణ

ఆలయాలను సైతం వదలని దుండగులు

పోలీసులు నిఘా పెంచాలంటున్న అన్నదాతలు

పెద్దమండ్యం : పెద్దమండ్యం పంచాయతీలోని బిక్కావాండ్లపల్లె, చెరువుకిందపల్లె గ్రామాలలో శనివారం రాత్రి బోరు మోటార్ల వద్ద కేబుల్‌ వైర్ల చోరీ జరిగింది. కొన్ని రోజులుగా మండలంలోని ఆలయాలు, వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్‌ వైర్లను టార్గెట్‌ చేసిన దొంగలు వాటిని అపహరిస్తున్నారు. రెండు గ్రామాల్లో సుమ ఆరు 15 వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు చోరీ కాగా, అక్కడికి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆంప్లిఫైర్‌, మైకులు, హుండీలు చోరీకి గురయ్యాయి.

నెలరోజులుగా వరుస చోరీలు

గత నెల రోజులుగా వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు చోరీలు జరుగుతున్నాయి. వ్యవసాయబోరు మోటారు నుంచి స్టార్టర్‌ వరకు ఉన్న కేబుల్‌ వైర్‌ను అందిన కాడికి కట్‌ చేసుకుని వెళుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మీటరు కేబుల్‌ వైరు రూ. 210 వరకు పలుకుతోంది. కేబుల్‌ వైర్‌ రేటు ఎక్కువగా ఉండడంతో దొంగలు వ్యవసాయ బోర్లను టార్గెట్‌ చేశారు. రైతుల బోర్లే కాకుండా పంచాయతీ బోర్ల వద్ద కేబుల్‌ వైర్‌ను కట్‌ చేస్తున్నారు. ఒక్కో బోరు వద్ద కేబుల్‌ వైరు, స్టార్టర్‌ నుంచి పీజు క్యారియర్‌ల వరకు కనెక్షన్‌ ఇచ్చిన కాపర్‌ వైర్‌ చోరీ జరిగితే రైతుకు రూ.5 వేల వరకు నష్టం కలుగుతోంది.

రోడ్డు పక్కనున్న మోటార్‌లే లక్ష్యం

వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు చోరీ చేస్తున్న ముఠా రోడ్డు పక్కనున్న వాటినే వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. మండలంలోని బండమీదపల్లె, వెలిగల్లు, శిద్దవరం, కలిచెర్ల, ఎన్‌వోపల్లె, పాపేపల్లె, పెద్దమండ్యం గ్రామాలలో నెల రోజులుగా కేబుల్‌ వైర్ల చోరీలు జరుగుతున్నాయి. పలువురు రైతులకు ఈ గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయబోర్లు వేశారు. ఆరుతడి పంటలు, టమోటా, వేరుశెనగ సాగు చేశారు. అయితే దొంగలు మోటార్లు వద్ద కేబుల్‌ వైరు చోరీ చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావంతో పంటలకు నీరు అంతంత మాత్రమే వస్తుంటే దొంగల బెడద ఎక్కువైందని ఆందోళన చెందుతున్నారు. ఆలయాలను కూడా దొంగలు వదలడం లేదు. హుండీలు, ఆంప్లిఫైర్లు, మైక్‌లు ఇలా అందిన కాడికి దోచుకుంటున్నారు.

పోలీసుల అదుపులో ద్విచక్రవాహనాలు..?

వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు, ఆలయంలో ఆంప్లిఫైర్లు, మైకులు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు ఉపయోగించిన ద్విచక్రవాహనాలు శనివారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దొంగలించిన వైర్లు, ఆలయంలోని హుండీ, ఆంప్లిఫైర్లు ద్విచక్రవాహనాలలో తీసుకెళుతుండగా పోలీసులను చూసిన దొంగలు ద్విచక్రవాహనాలు వదిలి పరారైనట్లు తెలిసింది. అర్ధరాత్రి బీట్‌ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు దొంగలు పెద్దమండ్యం–గుర్రంకొండ రహదారిలోని యర్రగుట్టపల్లె వద్ద కనిపించారు. పోలీసులను గుర్తించిన దొంగలు రెండు ద్విచక్రవాహనాలు (స్కూటీలు) అక్కడే వదిలి పారిపోయారు. దొంగలు వినియోగించిన ద్విచక్రవాహనాలలో ఒక్కటి కొత్తది కావడంతో నెంబర్‌ ప్లేటు ఉంది. మరో వాహనానికి నెంబర్‌ ప్లేటు లేదు. కేబుల్‌ వైరు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

ఆంజనేయస్వామి ఆలయంలో

చోరీ చేసిన దుండగులు

బిక్కావాండ్లపల్లె సమీపంలో వ్యవసాయ బోరు వద్ద కట్‌ చేసిన కేబుల్‌ వైరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement