మదనపల్లె టౌన్: మదనపల్లి పట్టణంలో ఓ యువకుడిపై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితుడు వన్‌టౌన్ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక త్యాగరాజ వీధిలో కాపురం ఉంటున్న సలీం (30) పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడని యువతి సంబంధీకులు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. దాడి ఘటనపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు
టమాటా లారీ బోల్తా
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం ఎర్రగుంట్ల సమీపంలో టమాటాలు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. కలకడ నుంచి హర్యానాకు టమాటా లోడుతో వెళుతున్న లారీ ఎర్రగుంట్ల బస్టాప్ దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న టమాటా బాక్స్‌లు చెల్లాచెదురుగా పడ్డాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్: మదనపల్లె టమాటా మార్కెట్ యార్డ్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 2 టౌన్ ఏఎస్‌ఐ కథనం ప్రకారం, సుమారు 60 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వారం రోజులుగా మార్కెట్ యార్డులోని మండీల వద్ద ఉంటున్నట్లు మండి నిర్వాహకులు తెలిపారు. అనారోగ్యం కారణంగానో, లేదా సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్లనో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
దొంగతనం నెపంతో వ్యక్తిపై దాడి
మదనపల్లి టౌన్: మదనపల్లె పట్టణంలోని సంత గేటు వద్ద ఎరగ్రడ్డల వ్యాపారం చేస్తున్న ఎస్‌కేఎం ట్రేడర్స్ యజమాని కరీం బాషా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడని ఒక యువకుడిని రాతి స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి మదనపల్లి మండలం, వేంపల్లి గ్రామానికి చెందిన సి. నాగేంద్ర అనే వ్యక్తిపై ఎస్‌కేఎం ట్రేడర్స్ యజమాని సిబ్బందితో కలసి రాతి స్తంభానికి కొట్టారు. దుకాణంలో రూ. 20 వేల అపహరించాడనే అనుమానంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లి టూటౌన్ పోలీసులు వెంటనే సంఘటన జరిగిన సంత వద్దకు చేరుకుని నాగేంద్ర విడిపించి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


