చెక్‌ బౌన్స్‌ కేసులో ఆరు నెలలు జైలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ కేసులో ఆరు నెలలు జైలు

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

పుంగనూరు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన వ్యక్తికి ఆరు నెలలు జైలుశిక్ష, రూ.5.50 లక్షల జరిమానా విధిస్తూ పుంగనూరు అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కృష్ణవంశి తీర్పునిచ్చారు. పట్టణానికి చెందిన పి.కేశవరెడ్డికి మదనపల్లెకి చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి నాగరాజు 2016లో రూ.5 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే నాగరాజు చెక్కును కేశవరెడ్డికి ఇచ్చి డబ్బులు డ్రా చేసుకోమని సూచించాడు. దీనిపై కేశవరెడ్డి పుంగనూరులోని తన ఖాతాలో చెక్కును డబ్బు వసూలుకు దాఖలు చేశాడు. నాగరాజు చెల్లని చెక్కు ఇవ్వడంతో కేశవరెడ్డి మనస్తాపానికి గురై నాగరాజుపై పుంగనూరు కోర్టులో సీసీ నంబరు 455/2016గా కేసు దాఖలు చేశారు. దీనిపై పదేళ్లపాటు కేసు సుధీర్ఘవిచారణ సాగింది. సోమవారం విచారణ ముగియడంతో న్యాయమూర్తి కృష్ణవంశి తీర్పును వెలువరించారు. ఈ తీర్పులో నాగరాజు ఇవ్వాల్సిన చెక్కు డబ్బు రూ.5 లక్షలతో పాటు రూ.5.50 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. అలాగే చెల్లని చెక్కు ఇచ్చి మోసగించినందుకు 6 నెలల జైలుశిక్ష విధించారు.

వ్యవసాయ మోటార్ల కేబుల్‌ వైర్‌ చోరీ

గుర్రంకొండ: మండలంలోని సరిమడుగులో రైతుల వ్యవసాయ మోటార్ల వైర్‌ చోరీకి గురయ్యాయి. పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం, సరిమడుగు గ్రామాల పరిధిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పదిబోర్ల వద్ద 250 మీటర్ల కేబుల్‌ను చోరీ చేశారు. మంగళవారం ఉదయాన్నే పొలాల వద్దకు బోరుమోటారు ఆన్‌చేయడానికి వెళ్లిన రైతులకు కేబుల్‌ కత్తిరించినట్లు గుర్తించారు. ప్రతి మోటర్‌కు రూ.4వేలు ఖర్చు చేసి కేబుల్‌ వైరు కొనాల్సి వస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.

విగ్రహాల చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

పుంగనూరు: వివిధ ఆలయాల్లో ఇత్తడి, రాగి, పంచలోహాల విగ్రహాలను చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని, అతడి వద్ద నుంచి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లెకి చెందిన ఎలకపల్లి ప్రభాకర్‌ (39) అనే వ్యక్తి ఆలయాల్లో రాగి, ఇత్తడి, పంచలోహాల విగ్రహాలు, వస్తువులు చోరీ చేసుకుని బయట ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఆటోలో విగ్రహాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని, ఆటోను సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement