● 15 పతకాలు సాధించిన విద్యార్థులు
● జాతీయ స్థాయికి
ఐదుగురు విద్యారుల ఎంపిక
మదనపల్లె సిటీ: జిల్లా ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్‌లో విశేష ప్రతిభ కనబరిచి 15 పతకాలు సాధించారు. వీరిని మంగళవారం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులను అభినందించారు. జిల్లా సహిత విద్యా సమన్వయకర్త జనార్దన్ మాట్లాడుతూ ఈనెల 20వతేదీ నుంచి 22 తేదీ వరకు ఏలూరు జిల్లా అగిరిపల్లె హిల్ పార్యడైజ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ పోటీల్లో కలకడ మండలానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి బి.దిలీప్‌కుమార్ 100 మీటర్ల పరుగు పందెం,షాట్‌ఫుట్‌లలో బంగారు పతకం సాధించారన్నారు. పెద్దమండ్యం జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ 100 మీటర్ల పరుగుపందెంలో బంగారు,లాంగ్ జంప్ నందు వెండి పతకాలను సాధించినట్లు తెలిపారు. రాయచోటి మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి వెంకటమనోజ్ లాంగ్‌జంప్‌లో బంగారు, 100 మీటర్ల పరుగు పందెంలో వెండి, 2000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పథకం సాధించినట్లు తెలిపారు. ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు వెంకటనారాయణ, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


