బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ | - | Sakshi
Sakshi News home page

బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ

బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ

మదనపల్లె రూరల్‌ : మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10 చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్‌ ఇండియా బిక్ఖు సంఘం ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ ఉమ్మడి కమిటీ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమ ప్రచారంలో భాగంగా గురువారం మదనపల్లెకు వచ్చిన ఆయన ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లో బౌద్ధసంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారతీయ అంబేడ్కర్‌ సేన(బాస్‌) వ్యవస్థాపకులు పీటీఎం.శివప్రసాద్‌తో కలిసి చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మదనపల్లె బుద్ధునికొండలో కొందరు దుండగులు బుద్ధుని విగ్రహాలకు తలలు ధ్వంసం చేస్తుంటే ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బుద్ధ విగ్రహాల విధ్వంసం, బౌద్ధులపై వేధింపులు, బుద్ధునికొండపై నిషేధాజ్ఞలను తీవ్రంగా ఖండించారు. బుద్ధునికొండ అమానుషంపై ఢిల్లీ వేదికగా తీవ్రంగా నిరసన తెలిపేందుకు బౌద్ధులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. బౌద్ధ ఉపాసక పీటీయం.శివప్రసాద్‌ మాట్లాడుతూ...రాష్ట్రంలో బౌద్ధంపై ద్వేషం ఎక్కువైందని, బుద్ధ విహారాలకు, బౌద్ధ విశ్వాసులకు రక్షణ కరువైందని ఆరోపించారు. 21 సంవత్సరాలుగా బుద్ధునికొండలో బుద్ధవిహార నిర్వహిస్తున్నామని, నాలుగేళ్లుగా మూడు విగ్రహాలకు తలలు తొలగించి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఘటనపై గత ఏడాది జూలై 2న తాము ఫిర్యాదుచేస్తే, బాధితులమైన తమతో అధికారులకు నిర్దయగా ప్రవర్తిస్తూ, నిందితులకు కొమ్ముకాస్తూ, తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేశారన్నారు. తమ ఆవేదన తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోగా, బెదిరింపులకు పాల్పడుతూ, అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చామని, అక్కడ నిరసన తెలపడం ద్వారా బౌద్ధుల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో వీసీకే, బాస్‌ ప్రతినిధులు వై.గంగాధర్‌, బురుజు రెడ్డిప్రసాద్‌, సొన్నికంటి రెడ్డెప్ప, జీ.వి.రమణ, జి.గంగులప్ప, జనార్ధన్‌, రవిశంకర్‌, నారాయణ, శ్రీనివాసులు, మోహన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement