నువ్వే నా ప్రాణం
కలకడ: కలకాలం తోడు నీడగా ఉంటానని పెళ్లిలో అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త మరణించడంతో తట్టుకోలేని భార్య అసువులు బాసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ బాకివానివడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. బాకివానివడ్డిపల్లెకు చెందిన ఆవులకుంట నాగులు (80) వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ భార్య నారాయణమ్మ(75) తో పాటు కుమారుడు, కుమార్తె, కోడలు, మనవళ్లతో జీవించేవారు. వృద్ధులయినా రోజువారి కష్టార్జితంతో ముందుకు సాగేవారు. నాగులు కాలికి రక్త సరఫరా సక్రమంగా కావడం లేదని వారం క్రితం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భర్త ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేవరకూ అన్నం కూడా ముట్టుకోకుండా నారాయణమ్మ నిరీక్షించింది. భర్త ఇంటికి చేరుకున్నాక అన్ని సేవలు చేసింది. కాలికి ఆపరేషన్ చేయించినా నాగులు శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలపడంతో మంగళవారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9.40 గంటలకు నాగులు మృతిచెందాడు. భర్త మృతిని తట్టుకోలేని భార్య అపస్మాకర స్థితిలోకి చేరుకోవడంతో బంధువులు, కుమారుడు గంగాధర కలిసి తండ్రి మృతదేహాన్ని ఇంటిముందు పెట్టుకుని తల్లికి చికిత్స చేయించడానికి మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నారాయణమ్మను పీలేరుకు తరలించగా, చికిత్స పూర్తిగా అందకనే 11.40 గంటలకే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరి అంత్య క్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భర్త మరణ వార్త విన్న భార్య మృతి


