విన్నపాలు వినవలె..సమస్యలు తీర్చవలె !
వాట్సాప్ సేవలపై ప్రజలలో అవగాహన
● పీజీఆర్‌ఎస్‌లో పరిష్కారానికి
అర్జీదారుల వేడుకోలు
● వివిధ ఇబ్బందులపై 348 అర్జీల నమోదు
● వినతులు స్వీకరించిన
కలెక్టర్ నిశాంత్‌కుమార్
మదనపల్లె రూరల్ : ‘ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా మాకు న్యాయం చేయండయ్యా’ అంటూ అర్జీదారులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌ను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు ప్రజలు పోటెత్తారు. పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్‌కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, సర్వే ఏడీ భరత్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీకి న్యాయం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 348 అర్జీలు అందాయి.
అర్జీదారులు విన్నవించిన కొన్ని సమస్యలు
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
కష్టపడి సంపాదించిన సొమ్మును పరిచయస్తులని నమ్మి ఇస్తే, డబ్బును కాజేయడమే కాకుండా తనపైనే దాడికి పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని హిజ్రా ఇంజరపు స్వాతి ఫిర్యాదు చేశారు. మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న చిరుద్యోగి, అతడి భార్య తనతో సన్నిహితంగా ఉంటూ, పార్టనర్‌షిప్‌లో స్కూల్ పెడదామని నమ్మించి విడతలవారీగా రూ.కోటికి పైగా తీసుకున్నారన్నారు. ఎన్నిరోజులైనా తీసుకున్న నగదు ఇవ్వకపోవడం, స్కూల్ పెట్టకపోవడంతో వారిని ప్రశ్నిస్తే.. తమకున్న రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై పలుసార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, అధికారులు వారికే మద్దతుగా మాట్లాడుతున్నారని, తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బాధితురాలికి మద్దతుగా దాదాపు పదిమందికి పైగా హిజ్రాలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
11 ఏళ్లుగా పరిహారం కోసం ప్రదక్షిణలు
హంద్రీ–నీవా కాలువ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు సంబంధించి పరిహారం కోసం 11 ఏళ్లుగా సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని పీటీయం మండలం కందూరుకు చెందిన రైతులు సాబ్‌జాన్, వెంకటరమణ, ఈశ్వరయ్య ఫిర్యాదుచేశారు. పలుమార్లు పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని, ఇప్పటికే పరిహారం కోసం ఎదురుచూసి తమలో ముగ్గురు రైతులు మరణించారని, తాము చచ్చాక పరిహారం ఇస్తే ఉపయోగం ఉండదని వాపోయారు.
కోర్టులో కేసు ఉన్నా ఆగని ఆక్రమణ
చౌడేపల్లె మండలం చారాల కురప్పల్లెలో సర్వే నం.71/14లో 0.28 సెంట్ల భూమికి సంబంధించి కోర్టులో వివాదం ఉన్నప్పటికీ, అదే గ్రామానికి చెందిన జె.సుబ్రహ్మణ్యం దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెంగప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, ఉన్న విస్తీర్ణం కన్నా అధికంగా భూమిని పాసుపుస్తకాల్లోకి ఎక్కించుకుని ఇతరుల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు.
మదనపల్లె : వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన పెంచాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలపై భూసేకరణ, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర, పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన అర్జీలు, వాట్సాప్ ద్వారా సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హౌసింగ్– ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను పూర్తి చేయాలన్నారు.


