పొలాలపై ఏనుగుల గుంపుదాడి
పులిచెర్ల(కల్లూరు) : చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని గడ్డంవారి పల్లె, పాతపేట పంచాయతీలలో సోమవారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాల్లో ప్రవేశించి భారీగా పంట నాశనం చేసాయి .గత మూడు నెలలుగా మండలం విడిచి వెళ్లిన 15 ఏనుగులు గుంపుగా తిరిగి సోమవారం రాత్రి మండలానికి వచ్చాయి. ఒంటరి ఏనుగు మాత్రం గత కొన్ని నెలలుగా ఇక్కడే తిరుగుతూ రోజూ ఎక్కడో ఒకచోట పంటలను నాశనం చేస్తున్నది. తాజాగా ఈ ఒంటరి ఏనుగు పాతపేట పంచాయతీలో వేరుశనగ, టమోటా, పూల తోటలను నాశనం చేసింది. అదే సమయంలో ఏనుగుల గుంపు మండలంలోని తూర్పు ప్రాంతంలో తొలిసారిగా గడ్డంవారిపల్లె, పగడాలవారిపల్లె గ్రామాల్లో వరి పైరును తొక్కి నాశనం చేసింది. భాకరాపేట రిజర్వు ఫారెస్టులోకి ఎప్పుడో వెళ్ళి పోయిన ఏనుగులు మళ్ళీ రావడంతో ఫారెస్టు అధికారులు సైతం బిత్తరపోయారు. దీనితో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట పొలాలవద్దకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు.


