గ్యాంగ్ దాడుల్లో ఒకరికి కత్తి పోట్లు
రాయచోటి : రాయచోటి పట్టణంలో గ్యాంగ్ వార్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. రాయచోటి పట్టణం అబూబకర్ సిద్దిక్ మసీదు సమీపంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఒక గ్యాంగ్ ముఠా మరో గ్యాంగ్ పై దాడికి తెగబడింది. ఈ దాడిలో షేక్ హబీబ్ కుమారుడు ఖళీద్ (22) కడుపునకు రెండు కత్తిపోట్ల గాయాలు అయ్యాయి. పట్టణంలోని మరో గ్యాంగ్‌కు చెందిన ఇమ్రాన్, ఇశ్రాన్, రిహాన్, ఖాదర్ అలియాస్ మోటులు తనపై కత్తితో దాడి చేశారని బాధితుడు ఖలీదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రత్యర్థి గ్యాంగ్ దాడిలో గాయపడిన యువకులే నేడు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసుల సమాచారం. కత్తిపోట్లతో గాయపడిన ఖలీదును రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు రెఫర్ చేశారు. దాడి సంఘటనపై రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


