అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
● మృతుడు కోవెలకుంట్ల వాసిగా గుర్తింపు
● బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఖాజీపేట : అనుమానాస్పదంగా పడి ఉన్న మృతదేహం పై అనేక అనుమానాలు.. సందేహాల నడుమ కడప రిమ్స్‌కు మృతదేహాన్ని తరలించారు.. విచారణ జరుపగా చనిపోయిన వ్యక్తి కోవెలకుంట్ల వాసిగా గుర్తించారు.. అయితే అతని మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెలితే ఖాజీపేట మండలం పాటిమీదపల్లె సమీపంలోని టోల్ ప్లాజా కు దగ్గరగా వ్యక్తి చనిపోయి పడి ఉండటం స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం ఖాజీపేట సీఐ వంశీధర్‌కు ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడకి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అతని వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లోని పెద్ద అల్లుడు సాల్‌రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
బంధువులతో పోలీసుల విచారణ తరువాత చనిపోయిన వ్యక్తి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం బిజివేముల గ్రామంగా తెలిసింది. చనిపోయిన వ్యక్తి పేరు బత్తల ఎర్రన్న గా గుర్తించారు. మృతుడు 2వ తేది ఉదయం 10 గంటలకు గుంటూరులోని ప్రార్థనలకు వెళుతున్నట్లు బంధువులకు చెప్పాడని.. అయితే ఖాజీపేటలో ఎలా మృతి చెందాడు అన్నది అంతుచిక్కని విషయంగా మారింది.
మృతి పై అనుమానాలు..
గుంటూరుకు వెళుతున్న వ్యక్తి ఖాజీపేట మండలం పాటిమీద పల్లెకు వచ్చి ఎలా చనిపోయాడు.. చనిపోవడానికి కారణాలు ఏమిటీ అన్నది తెలియాల్సి ఉంది.


