కేబుల్ వైర్లు చోరీ
చౌడేపల్లె : మండలంలోని దిగువపల్లె పంచాయతీ మేకలవారిపల్లె పరిసర ప్రాంతాల్లో రైతులకు చెందిన వ్యవసాయ బోర్లకు అమర్చిన సుమారు రూ:1 లక్ష విలువచేసే కేబుల్ వైర్లు సోమవారం రాత్రి చోరీ అయ్యాయి. మంగళవారం ఉదయం బోర్లవద్దకు వెళ్లిన రైతులు కేబుల్‌వైర్లు చోరీ అయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు 20మందికి చెందిన వైర్లు రాత్రి చోరీ అయినట్లు తెలిసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోలీసులు నిఘా ముమ్మరంచేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె అర్బన్ : కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. తంబళ్లపల్లె మండల కేంద్రానికి చెందిన రెడ్డెమ్మ(45)కూలిపనులు చేస్తుండేది. ఈనేపథ్యంలో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్ధానికులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందించారు.
పాముకాటుతో కూలీకి తీవ్ర అస్వస్థత
మదనపల్లె అర్బన్: పాముకాటుతో ఓ కూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ కొత్తిండ్లకు చెందిన రెడ్డెప్ప(46) కూలి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూలి పనులు చేసేందుకు మండలంలోని బొమ్మన చెరువుకు వెళ్లాడు. అక్కడ పొలంలో పనులు చేస్తుండగా విష సర్పం కాటేసింది. దీంతో రెడ్డెప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచర కూలీలు బాధితుని హుటాహుటీనా 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పొలంలో నిప్పంటుకుని రైతు మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన గుండం నరసింహులు (55) అలియాస్ వుల్లాచి అనే వికలాంగ రైతు మంగళవారం మృతి చెందాడు. వికలాంగ రైతు తన పొలం వద్దకు వెళ్ళి చుట్టూ ఉన్న గడ్డిని కాల్చేందుకు నిప్పు పెట్టాడు. మంటలు ఒక్కసారిగా తనను చుట్టు ముట్టి వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ రైతు తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో రైతు పొలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు.
సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
చౌడేపల్లె : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పెద్దకొండామర్రి, గడ్డంవారిపల్లె రెవెన్యూ గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ స్థలాలను మంగళవారం తహసీల్దార్ పార్వతి పరిశీలించారు. ట్రాన్స్‌కో ఏఈ శశిధర్, సర్వేయర్ల బృందంతో కలిసి స్థలాలను రికార్డుల ఆధారంగా పరిశీలన చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 15 ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చౌడేపల్లె : చౌడేపల్లె– పుంగనూరు మార్గంలోని చిన్నయల్లకుంట్ల సమీపంలోని చిగరమాను మిట్ట వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన జరిగింది. బూరగపల్లెకు చెందిన దేవరాజులు (50), నవీన్(25)లు పుంగనూరు వైపు నుంచి చౌడేపల్లెకు వస్తుండగా కింద పడ్డారు. బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగిందా...మరేదైనా వాహనం ఢీకొందా తెలియాల్సి ఉంది. గాయపడినవారిని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రెండు బైకులు ఢీ
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోగల ఊటుకూరు రింగురోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం రెండు బైకులు ఢీకొనడంతో ఇంజనీరింగ్ విద్యార్థి నంబూరి గోవర్ధన్ (19) మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఈసీఈ చదివే నంబూరి గోవర్ధన్, తన స్నేహితుడు నితీశ్వర్ రెడ్డి అనే విద్యార్థితో కలిసి ట్రయంఫ్ బైక్ పై కడప వైపు నుంచి అన్నమాచార్య కళాశాలకు బయలుదేరారు. ఊటుకూరు వైపునకు స్థానిక చైతన్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులతో వెళ్తుండిన కేర్ టేకర్ రాజశేఖర్ అనే వ్యక్తి తన హోండా బైక్ ను రోడ్డు అవతలివైపు రోడ్డులోకి గమనించకుండా మలుపు తిప్పడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోవర్ధన్ మృతి చెందగా కొందరికి గాయాలయ్యాయి.
కేబుల్ వైర్లు చోరీ
కేబుల్ వైర్లు చోరీ
కేబుల్ వైర్లు చోరీ


