లోకానికి వెలుగు ఏసు క్రీస్తు
కడప సెవెన్‌రోడ్స్ : క్రీస్తు ఏసు లోకానికి వెలుగై అవతరించారని మాసాపేట విచారణ గురువులు జోసెఫ్ రాజ్, ఫాదర్ బడుగు శ్యాంసన్‌లు అన్నారు. మంగళవారం మరియాపురం పాత చర్చి ఆవరణలో లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా జోసెఫ్ రాజ్ దివ్య బలిపూజ చేశారు. ఫాదర్ శ్యాంసన్ దైవ సందేశం అందజేస్తూ క్రీస్తు ఏసు తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చి మళ్లీ వెళ్లేంత వరకు మరియమాత ఆయనకు తోడుగా నిలిచిందన్నారు. తన సంఘాన్ని, శిష్యులను అప్పగిస్తున్నానని, వారికి తోడుగా ఉండాలంటూ శిలువ యాగ సమయంలో ప్రభువు ఏసుక్రీస్తు తన తల్లి మరియను కోరారన్నారు. అప్పటి నుంచి మరియతల్లి అందరికీ తోడుగా ఉంటోందన్నారు. ప్రభువు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన నిర్వహిస్తే ఎలాంటి వ్యాధి అయినా మటుమాయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మనోహర్, సురేష్, హృదయరాజ్, సిప్రియన్ సైమన్, విజయరావు, తిరునాల కమిటీ చైర్మన్ జి.బాలయ్య, ఉపాధ్యక్షులు పి.లూర్దు, ప్రధాన కార్యదర్శి జోసెఫ్, సహాయ కార్యదర్శి ఎన్.ప్రసాద్, ట్రెజరర్ విజయరాజు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.
లోకానికి వెలుగు ఏసు క్రీస్తు
లోకానికి వెలుగు ఏసు క్రీస్తు


