రాయచోటి: ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకున్న వరి, ఇతర పంటలకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా పరిణమించింది. రాయచోటి ట్రాన్స్‌కో కార్యాలయ పరిధిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఆడింది ఆట, వదిలిందే విద్యుత్ సరఫరా అన్న రీతిలో సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో నెలకొన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించడంలో లైన్‌మెన్‌లు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి రూరల్ మండలం, మాధవరంలో విద్యుత్ లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికి వచ్చిన వరిపంట ఎండపెట్టుకుంటున్న సంఘటన అక్కడ రైతులను కలచివేస్తోంది. గత ఐదు రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్ ఫీజులు దెబ్బతిని విద్యుత్ మోటార్లకు అందాల్సిన సరఫరా ఆగిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగు చేయించి సరఫరాను అందివ్వాలని స్థానిక రైతులు లైన్‌మెన్‌ను బతిమలాడినా ఫలితం లేదని తమటంవారిపల్లికి చెందిన రైతు ఎం రఘునాథ్ చెబుతున్నాడు. ఒక ఎకరం పొలంలో వరిపంటను సాగు చేసుకొని కోత దశకు చేరుకుంటున్న సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పంటను ఎండపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకుండా వరిపంటకు నష్టం కల్గించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతోపాటు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు.


