మండల అధికారులకే బాధ్యత
మదనపల్లె: జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ సర్పంచు, పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం నుంచి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులు సర్పంచుల స్థానంలో పరిపాలన సాగించనున్నారు.
మరోసారి..
గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలన సాగించడం కొత్తేమీ కాదు. 1986లో జరిగిన సర్పంచుల పదవీకాలం 1992లో పూర్తికాగా వెంటనే ఎన్నికల జరపలేదు. 1995 జూన్ లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. తర్వాత 2000, 2006లో పంచాయతీ ఎన్నికలు గడువు మీరిన తర్వాత వెంటనే నిర్వహించారు. ఈ రెండు ఎన్నికల్లో పంచాయతీలకు ప్రత్యేక పాలన రాలేదు. 2006 ఎన్నిక తర్వాత 2011లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా జరపలేదు. 2013 జూన్‌లో ఎన్నికలు నిర్వహించగా అప్పటిదాకా పంచాయతీలను ప్రత్యేక అధికారులు పాలించారు. 2018లో ఎన్నికలు జరగాల్సిన ఉండగా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ప్రత్యేక అధికారులు మళ్లీ పాలించారు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికై గురువారం నాటికి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. దాంతో మరోసారి ప్రత్యేక అధికారుల పరిపాలన వచ్చింది.
అధికారులకు అవగాహన: ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టే అధికారులకు పంచాయతీ పాలనపై అవగాహన కల్పించడం కోసం జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోని పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వారికే పంచాయతీ పాలనపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం కలెక్టర్ నిర్ణయం మేరకు సమావేశాలు ఎలా నిర్వహించాలన్న దానిపై పరిశీలిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ గురువారం చెప్పారు.
జిల్లాలోని 25 మండలాల్లో 411 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,749 పల్లెలు ఉండగా, అందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 3.54 ల క్షల మంది ఉన్నారు. మేజర్, అత్యధిక ఆదాయం వస్తున్న పంచాయతీలు ఉన్నాయి. వీటితోపాటు నామమాత్రపు ఆదాయంతో పథకాలు, గ్రాంట్లపై ఆధారపడి నడుస్తున్న పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల బాధ్యతను ప్రభుత్వం మండల స్థాయి అధికారులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఆయా మండలాల గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరంతా బాధ్యతలు చేపట్టి పంచాయతీ పాలనను సాగించాల్సి ఉంది.
జిల్లాలో 411 పంచాయతీలకుప్రత్యేక అధికారులు
నేటి నుంచి మండల స్థాయిఅధికారులకు అధికారం


