అవకాశం ఉన్నా...
వినియోగించుకోని బాబు
కలిసొచ్చిన పనిదినాలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) ఏప్రిల్ 1 నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ–2025 (వీబీజీ రామ్‌జీ) అమలు కావాల్సి ఉంది. అయితే విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1వ తేదీ వరకు ఈ పథకం అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఉపాధిహామీ పథకానికి భారీగా ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోపు పూర్తి చేసుకునేందుకు అవకాశం వచ్చింది. మరిన్ని పనిదినాలు పెరిగేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర వాటాల్లో వీబీజీ రామ్‌కు ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి చాలా తేడాలు ఉండడం వల్ల ప్రగతిలో ఉన్న పనులను మే 1వ తేదీలోగా పూర్తి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గుతుంది. ఒకవేళ మిగిలిపోతే కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. మేల్కొని హుషారు పడితేగానీ గడువులోపల పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో 18,572 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇందులో మెటీరియల్, రోడ్లు, డ్రైనేజీ, తారు, మెటల్ రోడ్లు, పశువుల పాక (క్యాటిల్‌షెడ్లు), కొత్త స్మశాన వాటికల అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి.
పీపీ–2 కింద మరిన్ని పనులు
పల్లె పండుగ (పీపీ–2) పథకం కింద ఉపాధిహామీలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గతేడాది జూన్‌లో ప్రారంభమైన ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం వీబీజీ రామ్‌జీ వాయిదా పడడంతో పీపీ–2 కింద పనులు కొనసాగేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి పనుల్లో వివిధరకాల రోడ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 800 పనులకు సంబంధించి రూ. 59 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. బీటీ రోడ్డు 74 పనులకు రూ. 26.09 కోట్లు, 71మెటల్ రోడ్డు పనులకు రూ. 16 కోట్లు, 17 పాఠశాలల ప్రహారీ గోడల పనులకు సంబంధించి రూ. 1.57 కోట్లు, 34 గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణాలకు రూ. 2 కోట్లు, మైదుకూరు నియోజకవర్గంలో 720 క్యాటిల్ షెడ్లు (పశువుల పాక)కు సంబంధించి రూ. 12.50 కోట్లు, ఇందులో శ్మశానాల అభివృద్ధికి 34 పనులకు రూ. 6 కోట్లు, 63,47,000 పనిదినాలకు సంబంధించి రూ. 173.37 కోట్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 8 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మెటీరియల్‌కు రూ. 145 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 140 కోట్లు పెండింగ్‌లో ఉండగా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి మే 1 నుంచి అమలు చేసే వీబీజీ రామ్‌జీ పథకానికి కేంద్ర, రాష్ట్ర వాటాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుత పథకంలో 90 శాతం కేంద్రం, కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, వీబీజీ రామ్‌జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలైన 13 రాష్ట్రాలకు వెసలుబాటు కల్పించి పాత పద్ధతిలోనే నిధులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు కల్పించుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. 2014లోనే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, ఉత్త చేతులతో ఉన్నామని, ఉన్న 10 శాతం కూడా చెల్లించలేమని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం వీబీజీ రామ్‌జీ పథకం వచ్చినప్పటికీ మౌనంగా ఉన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కొత్త పథకంపై పార్లమెంట్‌లో గళం విప్పగా, కూటమి ఎంపీలు మాత్రం మౌనం వహించడం గమనార్హం. చంద్రబాబుకు అవకాశం ఉన్నా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సఫలం కాకపోవడంతో ప్రజలనుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పది శాతమే కష్టమన్న చంద్రబాబు 40 శాతం వాటా చెల్లించే పరిస్థితి ఉందా? అని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వీబీజీ రామ్‌జీ పథకం మే 1వ తేదీకి వాయిదా వేయడంతో ఉపాధిహామీ పథకానికి ఊరట లభించింది. 140 కోట్లు కూలీల వేతనాలకు చెల్లించే పరిస్థితి వచ్చింది. 50 లక్షల పనిదినాలు చేసుకునేందుకు వీలు కలిగింది. మెటీరియల్ (నిర్మాణాత్మక పనులు)కు రూ. 93 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది.
మే 1కి వీబీజీ రామ్‌జీ పథకం వాయిదా
ప్రగతిలో 18,572 పనులు
50 లక్షల పనిదినాలుకలిసివచ్చే అవకాశం
మెటీరియల్ పనులు కూడాచేసుకునేందుకు మార్గం సుగమం
పాత పద్దతిలోనే పనులు పూర్తి చేయాల్సిన అవసరం
వెసులుబాటు కలిగింది
కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. మే 1లోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప


