● పలు మార్లు ఫిర్యాదు
కేవీపల్లె మండలంలో మైనింగ్ మాఫియాపై గతేడాది నుంచి సీపీఐ నాయకులు, బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు. అడవిపల్లె ప్రాజెక్టు సమీపంలో కొండలలో అక్రమంగా తమిళనాడు కూలీలచే మైనింగ్ చేయిస్తున్న మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అడవిపల్లె ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టు సమీపంలో పేలుళ్లు చేపడుతుండడంతో ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకుని ప్రాజెక్టును కాపాడాలని పలువురు కోరుతున్నారు.


