ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
కలికిరి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మహల్ సీహెచ్‌సీని ఆయన శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓ.పీ.రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్, సిబ్బంది హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తారు.. ఎలా నమోదు చేస్తున్నారు.. టీకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విధానాలు తదితరాలపై సిబ్బందిని నేరుగా విచారించారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు, వారి ఆరోగ్య వివరాలపై సిబ్బందిని విచారించారు. ఇంకా ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, సిబ్బంది కొరత ఉంటే అవసరమైన సిబ్బందిపై నివేదిక పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ఇతర వార్డులను పరిశీలించి, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అన్ని వసతులు ఉండాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, ఎంపీడీఒ భానుమూర్తిరావు, ఆసుపత్రి వైద్యాధికారులు మహేశ్వరరాజు, ప్రశాంతి..ఎంఈఒ–2 నాగార్జున, వీఆర్‌ఓలు ప్రసాద్‌రెడ్డి, ఆదిలక్ష్మి, షంషాద్, శ్రీనివాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


