మదనపల్లెలో పట్టపగలే భారీ చోరీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని కదిరి రోడ్డు సంగం ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ప్రశాంత్ నగర్ 4వ క్రాస్ రోడ్డులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని ప్రస్తుతం అమెరికాలో ఉండగా, ఆ ఇంటిలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేసే శేషాద్రి రెడ్డి అతని భార్య రెడ్డమ్మ ఉంటున్నారు. వారు సొంత పనులపై మరో ఊరికి వెళ్లాల్సి రావడంతో కాళ్ల మడుగులో ఉంటున్న రెడ్డమ్మ తల్లి ముత్తమ్మను పిలిపించి ఇంటికి కాపలాగా ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం ముత్తమ్మ పక్కింటి ఆవిడ భోజనం క్యారియర్ తీసుకుని స్కూలుకు వెళుతుండగా, ఆమెకు తోడుగా వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువా పగులగొట్టి అందులోని నగలు నగదు అపహరించుకుని వెళ్లారు. ఆమె స్కూల్ వద్ద నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళనగా ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తలుపులు తెరిచి ఉండడం, సీక్రెట్ లాకర్లను పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని అల్లుడు శేషాద్రి రెడ్డికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఇంటికి చేరుకుని పరిశీలించగా ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన రూ. 6 లక్షల నగదు, 90 గ్రాముల బంగారు చోరికి గురైనట్లు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది.
రూ.6 లక్షల నగదు,
90 గ్రాముల బంగారు అపహరణ


