గంగమ్మ సన్నిధిలో డీఐజీ
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మను డీఐజీ కోయప్రవీణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి , డీఎస్పీ మహేంద్రలకు ఈఓ ఏకాంబరం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టత, అమ్మవారి మహత్యాన్ని ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ అధికారులకు వివరించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి శేష వస్త్రం కప్పి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేదపండితులచే ఆశీర్వచనం చేయించారు. ఈ సంధర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలు చేరడంతో బోయకొండ విశిష్టతతో పాటు అవగాహన కోసం పర్యటించినట్లు చెప్పారు. బోయకొండలో భధ్రత విషయమై ఈఓ పలు అంశాలు చర్చించారని, పూర్తిస్థాయిలో సిబ్బంది కేటాయింపు అనంతరం పటిష్టమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఆయన వెంట సీఐలు సాయి ప్రసాద్, సుబ్బరాయుడు, ఎస్‌ఐ నాగేశ్వరరావు తదితరులున్నారు.


