బడ్జెట్‌ రైలు ఆగేనా? | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ రైలు ఆగేనా?

Jan 31 2026 6:39 AM | Updated on Jan 31 2026 6:39 AM

బడ్జెట్‌ రైలు ఆగేనా?

బడ్జెట్‌ రైలు ఆగేనా?

రేపు పార్లమెంట్‌లో కేంద్రబడ్జెట్‌

రైల్వేల పరంగా కేటాయింపుల కోసం ఉభయజిల్లా వాసుల ఎదురుచూపులు

రాజంపేట : రైల్వే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం 8వసారి ప్రవేశపెట్టనుంది. మొదటిసారిగా ఆదివారం రోజున కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం గమనార్హం. ఏటా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌లో ఉభయ జిల్లాల రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్‌లో కేవలం పాత ప్రాజెక్టులకే కేటాయించి చేతులు దులుపుకున్నారు. కొత్తగా ఏర్పాటైన సౌత్‌కోస్ట్‌జోన్‌కు తొలిబడ్జెట్‌ ఇది. ఏ విధంగా కేటాయింపులు ఉంటాయో వేచిచూడాల్సిందే.

ఓబులవారిపల్లె–కృష్ణపట్నం లైనున్నా...రైలేది

రూ.6,660 కోట్లతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం లైన్‌ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు1, 2019లో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైలును నడిపించలేదు. కర్నూలు, నంద్యాల, కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నెల్లూరు మీదుగా రైలుప్రయాణాలు కొనసాగించేందుకు వీలవుతుంది.ఈ విధమైన ప్రతిపాదనలను రైల్వే అధికారులు చేయడంలేదు.

● ముంబై–చైన్నె ప్రధాన రైలుమార్గంపేరుకే. కానీ రైళ్లు అరకొరే. వందేభారత్‌, అమృత్‌భారత్‌ లాంటి రైళ్లు ఈ మార్గంలో నడిపించరు. కోస్తా రైలుమార్గాలకు ఉన్న ప్రాధాన్యం ఈ రైలుమార్గానికి ఇవ్వడంలేదన్న అపవాదును కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ మూటకట్టుకుంది.

కొత్తరైళ్ల కూత ఏదీ..

● ఉభయజిల్లామీదుగా బెంగళూరు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా లేదు.

● గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో ఉభయ వైఎస్సార్‌ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు ప్యాసింజర్‌ రైళ్ల సౌకర్యం కల్పించే ప్రతిపాదనలు ఏవీ పట్టా లెక్కడంలేదు. ఉదయం తిరుపతి వైపు, సాయంత్రం కడప వైపు ఒక ప్యాసింజర్‌రైలు నడిపించే ప్రతిపాదన చేయాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

● తిరుపతి–విజయవాడకు జిల్లా మీదుగా ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడిపించే విధంగా కొత్తరైలును ప్రవేశపెట్టాలని ప్రయాణికుల డిమాండ్‌.

● ఉభయ వైఎస్సార్‌ జిల్లాలను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమోరైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

● విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు,రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట,నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్‌ప్రెస్‌ రైలును తీసుకొస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

నందలూరులో రైళ్లకు వాటరింగ్‌ ప్రతిపాదన కనుమరుగు

నందలూరు రైల్వేకేంద్రంలో వాటరింగ్‌ ప్రతిపాదన కోవిడ్‌–19 ముందు చేశారు. సర్వే కూడా నిర్వహించారు. రూ.35లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. నందలూరులోపుష్కలంగా నీటివనరులు ఉన్నాయని డివిజన్‌ ఉన్నతాధికారులకు తెలుసు. నీటి వల్ల బ్రిటీషర్లు నందలూరులో స్టీమ్‌లోకోషెడ్‌ను ఏర్పాటుచేశారు. తిరిగి ప్రతిపాదన అమలుచేస్తే, తిరుపతి, రేణిగుంటలో రైళ్ల ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది.

బాలాజీ డివిజన్‌ ఏర్పాటుతోనే..

డివిజన్‌ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్‌, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్లు ఉంటే డివిజన్‌గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్‌ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ),పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. బాలాజీ డివిజన్‌ ఏర్పాటుతో కడప రైల్వేల అభివృద్ధి, ప్రాముఖ్యత పెరుగుతుందని రైల్వేనిపుణులు అంటున్నారు.

గత బడ్జెట్‌లో ఇలా..

126 కీ.మీ దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్‌(ఎస్‌) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కి.మీటర్ల దూరం కలిగిన కష్ణపట్నం–ఓబులవారిపల్లైరెలుమార్గానికి డిపాజిట్‌(ఆర్‌వీఎన్‌) కింద 267.46 కోట్లు వ్యయం చేస్తున్నారు.

పులివెందులకు రైలుకూత..

2020లో బడ్జెట్‌లో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైన్‌ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తాయి. ఈ సారి బడ్జెట్‌లో 65 కి.మీటర్ల దూరమున్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్‌ ఆర్‌ఈటీ సర్వే కింద రూ.16 లక్షలు కేటాయించారు. 110 కి.మీ దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్‌కు రూ.2.75 కోట్ల ఫైనల్‌ లోకేషన్‌ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యే క గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులకు ఎదురచూపులే మిగులుతున్నాయి.

● గుంతకల్‌–రేణిగుంట మధ్య 3, 4 లైను నిర్మాణం రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్‌ లోకేషన్‌ సర్వే కింద గుంతకల్‌–ఓబులవారిపల్లె(256 కి.మీ) రూ.5.12కోట్లు కేటాయింపులు జరిగాయి. 56 కి.మీ దూరం ఉన్న ఓబలవారిపల్లె–రేణిగుంటకు ఫైనల్‌ లోకేషన్‌ సర్వే కోసం రూ.1.12 కోట్లు వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్‌లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్‌ రద్దీ భారం తగ్గుతుంది.

● ఉభయవైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు రూ.18 .80 కోట్లు కేటాయింపులు జరిగాయి. పార్శిల్‌ ఆఫీసు ఆధునీకరణ చేయనున్నారు. ఓపెన్‌ వెయిటింగ్‌ హాల్‌తోపాటు, రూ.4.44 కోట్లతో ఎస్కలేటర్స్‌ తదితర సౌకర్యాలు కల్పన దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్‌ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపులు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్‌లలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌సిస్టమ్‌ బలోపేతం పనులు చేపట్టనున్నారు.

● గుంతకల్‌–రేణిగుంట మార్గంలో ప్లాట్‌ఫాంలను పొడిగింపు చేయనున్నారు. రూ.3.55కోట్లతో 24/26/ఎల్‌హెచ్‌బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3.40కోట్లతో ప్లాట్‌ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

గూడ్స్‌షెడ్ల అభివృద్ధి : రైల్వేకోడూరులో గూడ్స్‌షెడ్‌ను రూ.11.55కోట్లతో ముద్దనూరు గూడ్స్‌షెడ్‌ రూ.13.26 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్‌ మిషన్‌సైడింగ్స్‌,రెస్ట్‌రూం తదితర సౌకర్యాల కోసం రూ.5.22కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డు లోని సబ్‌వేకు రూ.5.22 కోట్లు కేటాయించారు.

కడప–బెంగళూరు రైల్వేలైను ముందుకెళ్లేదెపుడో..

కడప–బెంగళూరు మధ్య రైలు నిర్మాణానికి 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు. ఈ రైలుమార్గానికి 2008–2009 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1000కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణపనులు మొదలయ్యాయి. 258కిలోమీటర మేర రైలుమార్గం నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఐదేళ్లు కాదుకదా..15ఏళ్లు దాటిపోయేలా కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. కడప–బెంగళూరు రైలుమార్గం నాలుగుఫేజ్‌ల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటిదశలో రూ.153కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేశారు. 21.8కిలోమీటర్ల మేర కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్న, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయం చేశారు.పెండ్లిమర్రి లైన్‌ వేశారు. అక్కడితో లైన్‌ ఆగిపోయింది. ఈలైన్‌ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. గత బడ్జెట్‌లో రూ.21లక్షలు కేటాయించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి పార్లమెంట్‌లో ఆదివారం

కేంద్రబడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఈసారి బడ్జెట్‌లోనైనా కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రైల్వేపరంగా

కేటాయింపులు జరిగేనా అని ఉభయ వైఎస్సార్‌జిల్లా ప్రయాణికులు ఆశగాఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement