రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మదనపల్లె : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మినరసయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని సిటిఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను, రోగుల సంఖ్య, కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్టులు పక్కాగా నిర్వహించాలన్నారు. మాత–శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. సంక్రమణ వ్యాధులు నియంత్రణ, టి బి కార్యక్రమాలు, సాధారణ రోగులకు అందిస్తున్న సేవల సూచికలను సిద్దంగా ఉంచాలన్నారు. రికార్డుల నిర్వహణ, మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించాలన్నారు. వైద్యాధికారిణి డాక్టె కృపలత, టిబి సూపర్‌వైజర్ ప్రభాకర్, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కుష్టువ్యాధిగ్రస్తులపై వివక్ష వద్దు
మదనపల్లె రూరల్ : కుష్టువ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్.లక్ష్మీనరసయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కుష్టునివారణ దినోత్సవంగా జరిపారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుష్టువ్యాధి అవగాహన కార్యక్రమాలపై పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కుష్టువ్యాధి అవగాహన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామపంచాయతీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 80 లెప్రసీ కేసులు ఉన్నాయన్నారు. 278 మందికి కుష్టువ్యాధి వల్ల కలిగిన అంగవైకల్యం కారణంగా పెన్షన్ అందించినట్లు చెప్పారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధిని ముందస్తుగా గుర్తించాలన్నారు. శరీరంపై స్పర్శలేని మచ్చలు నొప్పి లేకుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యూక్లీస్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, పీఎంఓ రవికుమార్, డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


