పాఠశాలలో క్షుద్రపూజలు తెచ్చిన తంటా
● రెండురోజులుగా బడికి గైర్హాజరైన పిల్లలు
● తమ పిల్లలను పంపేది లేదన్న తల్లిదండ్రులు
● ఇళ్లవద్దకెళ్లి చైతన్యం కల్పిస్తున్న టీచర్లు
చౌడేపల్లె : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసింది. పూజలు చేసిన స్థలంలో నడిచి వెళ్లిన ఓ విద్యార్థి వారం రోజుల్లో మృతిచెందడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ పాఠశాలకు కరణంవారిపల్లి, పలగార్లపల్లి, యనమసామనపల్లె, అన్నిపల్లి,పొన్నిపెంట, కాగతి నుంచి 96 మంది విద్యార్థులు వచ్చేవారు. ఈ ఘటనతో గత రెండు రోజులుగా పిల్లలు గైర్హాజరవ్వడంతో ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎంఈఓ లు కేశవరెడ్డి, తిరుమలమ్మలు చేరుకొని గ్రామస్తులు, తల్లిదండ్రులతో ఇంటిటికీ వెళ్లి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చారు.
ఏమి జరిగిందంటే: కాగతి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పుష్పల కుమారుడు బి. జయదీప్ ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈనెల 18వతేదీ ఆదివారం మౌళి అమావాస రోజున అదే గ్రామానికి ఓ మహిళ మరో మహిళ సహాయంతో పాఠశాల ఆవరణలో ముగ్గు పోసి నిమ్మపండ్లు కోసి అక్షింతలు వేసి క్షుద్రపూజలు చేసింది. 19వతేదీ న పాఠశాలకు వెళ్లిన జయదీప్ మధ్యాహ్న భోజనసమయంలో క్షుద్రపూజలు చేసిన స్థలంలో పడి ఉన్న నిమ్మపండు, పూజా సామగ్రిని తొక్కడం, ఇంటికి వెళ్లిన చిన్నారి భయాందోళనకు గురై అస్వస్థతకు లోనయ్యాడు. పాఠశాలలోని సీసీ పుటేజీ ఆధారంగా ఉపాధ్యాయులు క్షుద్రపూజలు చేయడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాధు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారం రోజులు గడవకముందే
వారం రోజులు గడవక ముందే ఈనెల 25న ఆదివారం జయదీప్ అకస్మాత్తుగా మృతిచెందాడు. తమ బిడ్డ క్షుద్రపూజలు చేసిన స్థలంలో దాటినందుకే మరణించాడని విద్యార్థి తల్లితండ్రులు శ్రీనివాసులు, పుష్పలు ఆరోపించారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో రెండు రోజులుగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు బంధువులు పట్టుబట్టారు.గ్రామంలో పెద్ద ల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోవడంతో గ్రామంలోని యువకులు, బంధువులు న్యాయం జరిగేవరకు పాఠశాలకు వెళ్లొద్దంటూ దారికి అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకొన్న ఎంఈఓలు కేశవరెడ్డి, తిరుమలమ్మలు కాగతికి చేరుకొన్నారు. గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. మూఢనమ్మకాలపై అపోహలు వీడాలని, పిల్లలను పాఠశాలకు పంపాలని అవగాహన కల్పించారు. 91 మందికి కేవలం 46 మంది మాత్రమే పాఠశాలకు హజరైనట్లు హెచ్‌ఎం దామోదర్ తెలిపారు. ఈ దారుణానికి యత్నించిన మహిళపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు జరిగిన పుత్ర శోకం మరే తండ్రికి జరగరాదంటూ జయదీప్ తల్లి తండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.తమకు న్యాయం చేయాలని డిమాండు చేస్తున్నారు.పాఠశాలకు చుట్టూ ప్రహరీ, మౌలిక వసతులుంటే ఈ ఘటన జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు పాఠశాల వరండాలో కొందరు మలమూత్ర విసర్జన చేయడం, మద్యం సీసాలు పగులకొట్టడం చేశారని, ఉన్నతాధికారులు, పాలకులు దృష్టిసారించాలని కోరుతున్నారు.
పాఠశాలలో క్షుద్రపూజలు తెచ్చిన తంటా


