అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మదనపల్లె రూరల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఆమెతో సహజనం చేస్తున్న ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుమారుడు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలం, కొత్తవారిపల్లి పంచాయతీ గుడిసివారి పల్లెకు చెందిన శాంసన్ భార్య ఎలిజా ప్రేమకుమారి (45)కి నాలుగేళ్ల క్రితం భర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు విల్సన్ విజయ్ కుమార్ ఉన్నాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. భర్త మరణానంతరం ఎలిజా ప్రేమకుమారి స్థానికంగా ఉన్న చలపతి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గత కొంతకాలంగా ప్రేమ కుమారి, చలపతిల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవ పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం చలపతి ఆమె ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నాడు. అయితే విధులు ముగించుకుని రాత్రి వచ్చిన కుమారుడు విల్సన్ విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే తల్లి అపస్మారక స్థితిలో ఉండడంతో లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు.ఈ విషయమై ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడు చలపతిని విచారించగా, తాను మూడు గంటల వరకు ఇంట్లోనే ఉన్నానని ఆమె ఉరి వేసుకొని చనిపోవడంతో తానే కిందకు దింపి ఇంటికి వెళ్లిపోయానని బదులు చెప్పాడు. అనంతరం తన తల్లి మృతి పై తాలూక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం మాలపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని ఆమెతో సహజీవనం చేస్తున్న చలపతి చంపేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు.


