ప్రవేశాలకు వేళాయె
● గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
● 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు
దరఖాస్తుల స్వీకరణ
మదనపల్లె సిటీ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు.. పేద విద్యార్థుల ఆశా కిరణాలు. సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి,ఇంటర్‌లో నూతన ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖా స్తుల స్వీకరణ ప్రారంభించారు. ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు విధానం ఇలా..
● గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు www.apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాస్‌పోర్టు ఫొటో, స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 19వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
● 5వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునేవారికి 11 ఏళ్లలోపు ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్ నాటికి 17 ఏళ్లకు మించకూడదు.
● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు.
● 5వ తరగతిలో ఆడ్మిషన్‌లకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గురుకుల పాఠశాలలు ఇవే?
జిల్లాలో బాలికల కోసం మదనపల్లె, రాయచోటి, సంబేపల్లి, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట, బురకాయలకోట, లక్కిరెడ్డిపల్లెల్లో 9 చోట్ల గురుకులాలున్నాయి. ప్రతి పాఠశాలలో ఎంపీసీ 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన నిర్వహిస్తున్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలున్నాయి. తాజాగా వచ్చే విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌లు పొందేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–మల్లీశ్వరి, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ, మదనపల్లె


