మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పై జనసేన నాయకుడు దాడి
మదనపల్లె రూరల్ : ములకలచెరువు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి (65)పై జనసేన నాయకుడు, ఏపీ ఐసీసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్, అతని సోదరుడు మై ఫోర్స్ సంస్థ అధ్యక్షుడు ఉమేష్ దాడి చేశారు. గురువారం సాయంత్రం మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ ఎంజి గ్రాండ్ హోటల్ ఎదురుగా సంఘటన జరిగింది. ఈ విషయమై బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన మేరకు వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లెకు చెందిన ములకలచెరువు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం బి.కొత్తకోటలో నివాసం ఉంటున్నారు. గురువారం వ్యక్తిగత పనులపై కారులో మదనపల్లెకు వచ్చాడు. గొల్లపల్లి సర్కిల్ సమీపంలోని ఎంజీ గ్రాండ్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన కారు పార్కింగ్ చేసి, హోటల్ పక్కనే ఉన్న లాడ్జీలోకి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు. ఈలోపు ఎంజీ హోటల్ నిర్వాహకులు, జనసేన నాయకుడు, ఏపీ ఐసీసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్,అతని సోదరుడు ఉమేష్ లు చంద్రశేఖర్ రెడ్డి కారు చక్రాలను లాక్ చేశారు. కిందికి దిగి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చంద్రశేఖర్‌రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. మహేష్ సోదరుడు ఉమేష్, కత్తితో దాడికి ప్రయత్నించడంతో చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు జిల్లా ఆసుపత్రికి చేరుకొని చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కాగా, జనసేన నాయకుడి దాడిలో గాయపడిన మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిని, జనసేన పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు గంగారపు రాందాస్‌చౌదరి, మార్కెట్‌కమిటీ చైర్మన్ జంగాల శివరాం, కాంగ్రెస్ నాయకులు రెడ్డిసాహెబ్, వైఎస్సార్ సీపీ నాయకులు సీపీ.సుబ్బారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు.


