హుండీ ద్వారా రూ. 5,93,203 ఆదాయం
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ. 5,93,203 ఆదాయం వచ్చింది. గురువారం స్థానిక ఆలయ ప్రాంగణంలో జిల్లా దేవదాయశాఖా అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులు రెండునెలలకు సంబందించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు.అలాగే కానుకల కింద 23 గ్రాముల బంగారు, 422 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చాయి. వీటితోపాటు మొదటిసారిగా 30 అమెరికన్ డాలర్లు అమ్మవారి హండీలో రావడం గమనార్హం. ఈ మొత్తాన్ని వాయల్పాడు సప్తగిరి గ్రామీణబ్యాంకులో జమచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల, సిబ్బంది బాలకృష్ణ, వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు తలనీలాల వేలం
శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయంలో ఈనెల31న తలనీలాల వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించే తలనీలాలను సంవత్సరం పాటు సేకరించుకొనేందుకుగానూ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో జిల్లా దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలం పాటలు జరుగుతాయన్నారు. వేలం పాటలకు సంబంధించి ఈ టెండెర్,సీల్డ్‌టెండెర్లు వేయదలిచిన కాంట్రాక్టర్లు శనివారం 10.30 గంటల లోగా వేసుకోవాలన్నారు. వేలం పాటల్లో నేరుగా పాల్గోనేవారు ముందుగా రూ. 5లక్షలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


