అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యం
రాయచోటి : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఫౌండేషన్ లిటరీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బేస్ లైన్ సర్వేను చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలోని 3698 ప్రాథమిక పాఠశాలల్లో 1,11,587 మంది విద్యార్థులకు అమలవుతున్న సర్వే లిప్ (లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) యాప్ ద్వారా సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సర్వేలో డైట్ విద్యార్థులు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ పాల్గొంటున్నారన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ సర్వే ద్వారా పాఠశాల స్థాయి నుండి జిల్లా స్థాయిలలో సమగ్ర డేటా సేకరిస్తామన్నారు. దీనిద్వారా ఏ విద్యార్థి నైపుణ్యంలో బలహీనత కలిగి ఉన్నాడో, ఏ పాఠశాలలో వెనుకబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందో, ఏ టీచర్లకు శిక్షణ అవసరమో ప్రభుత్వం గుర్తించనున్నట్లు చెప్పారు. సమాచారం ఆధారంగా ప్రత్యేక శిక్షణలు, విద్యా నాణ్యత పెంపునకు చర్యలు అమలు చేయనున్నట్లుచెప్పారు. డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాయచోటి మండలం అబ్బవరం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చాత్రోపాధ్యాయిని సాగరిక, సీఆర్‌పీ విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయిని శ్రీదేవి పాల్గొన్నారు.


