దరఖాస్తు చేసుకోండి
రాయచోటి టౌన్ : ఉమ్మడి కడప జిల్లాలోని మైనార్టీలు, క్రిస్టియన్లు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తుచేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వి. బ్రహ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు 50శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు http:// apobmms.apcfss.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9290448452 /08562–241137 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
రేపు ఉద్యోగ మేళా
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా ఉపాధి కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన పీలేరులోని ఎస్‌జీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రముఖ కంపెనీలతో ఉద్యోగమేళా జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు కంపెనీల్లో పనిచేసేందుకు ఆసక్తి గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ చదివి 18–35 సంవత్సరాలు కలిగి ఉండాలని తెలిపారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఉత్సవ మూర్తులను వివిధరకాల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
నూతన నియామకం
రాజంపేట : రిప్లబికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షునిగా చౌడవరం సుబ్బనరసయ్య నియమితులయ్యారు. ఈమేరకు ఆర్‌పీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకటస్వామి ఉత్తర్వులను విడుదల చేశారు. కేంద్రమంత్రి (సామాజికన్యాయం, సాధికారిత) రాందాస్ అత్వాలే ఆదేశాల మేరకు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం బొమ్మవరానికి చెందిన సుబ్బనర సయ్యను జిల్లా అధ్యక్షునిగా నియమించారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
వీరబల్లి : మండలంలో తాటిగుంటపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ పంచాయతీలోని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి (డీపీఓ) ఖాదర్‌వల్లి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులను సచివాలయానికి పిలిపించి వారి సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపినాథ్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ,బీకాం, బ్యాచిరల్ ఆఫ్ వొకేషనల్ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 80 కళాశాల నుంచి 55 కేంద్రాల్లో 25,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, స్పిరిట్స్ డిగ్రీ కళాశాల కేంద్రాలను విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు , వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు మే 24వ తేదీ వరకు ఉంటాయన్నారు.
దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తు చేసుకోండి


