MPTC ZPTC Elections In Ap 2021 Results: Results Date And Full Details In Telugu - Sakshi
Sakshi News home page

AP: 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

Published Fri, Sep 17 2021 2:11 AM

ZPTC MPTC Elections Results On 19th September Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్‌’ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు.  చదవండి: గ్రహణం వీడింది: సజ్జల 

ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ.. 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అంతకుముందు ఉదయం హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని, ఫలితాలను వెల్లడించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఈ ఏడాది మే 21న ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది.

ఈ తీర్పులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఆక్షేపించింది. అలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం అవసరం లేదని పేర్కొంది. సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసినందున, ఆ తీర్పులోని వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జవలాకర్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.  చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే 

ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 1న ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ పోటీ చేసే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనడం అర్థం కాకుండా ఉందని తీర్పులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నోటిఫికేషన్‌ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులందరికీ వర్తిస్తున్నప్పుడు అది ఏ రకంగా అభ్యర్థుల హక్కులను హరిస్తుందో అర్థం కావడం లేదంది. వాస్తవానికి జనసేన నేత అభ్యర్థన ఎన్నికలను ఎక్కడ ఆపారో ఆ దశ నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి పెట్టాలన్నదేనని, అయితే ఈ అభ్యర్థనను సింగిల్‌ జడ్జి తన తీర్పులో తిరస్కరించారని ధర్మాసనం తెలిపింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియామావళిని అమలు చేయాలన్న వర్ల రామయ్య అభ్యర్థనను జనసేన నేత వ్యాజ్యంలో పరిగణలోకి తీసుకున్నారని అనుకున్నా.. ఏప్రిల్‌ 1న ఎన్నికల నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని సింగిల్‌ జడ్జి పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.

ఎన్నికల కమిషనర్‌ ఏప్రిల్‌ 1న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడమే కాకుండా, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయడాన్ని సింగిల్‌ జడ్జి తన తీర్పులో తప్పుపట్టారని, ఇది ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం తెలిపింది. చట్టబద్ధంగా అప్పీల్‌ దాఖలు చేసినప్పుడు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని సూచించింది. 

‘సుప్రీం’ ఆదేశాలను పాటించినట్లే 
ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను సంతృప్తిపరచడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప, ప్రతీ ఎన్నికకు 4 వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది.  

పిటిషన్‌లో ప్రస్తావించకున్నా.. 
మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయనప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తన వ్యాజ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి కనీసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని తెలిపింది. అయినప్పటికీ సింగిల్‌ జడ్జి తన తీర్పులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనను జనసేన ప్రస్తావించిందని, నియమావళిని అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగినట్లు నిరూపించారని అందులో పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. సింగిల్‌ జడ్జి తన తీర్పులో పేర్కొన్న విషయాలను జనసేన నేత తన పిటిషన్‌లో ప్రస్తావించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement