పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

YSRCP Supporters Huge Victory In Second Phase Of Panchayat Election - Sakshi

పంచాయతీ రెండో విడతలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానుల హవా

దాదాపు 80.4 శాతం స్థానాలు కైవసం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనకు ‘పల్లె’ బ్రహ్మరథం

ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు

3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌

539 చోట్ల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

2,786 సర్పంచ్‌ స్థానాల్లో సగటున 81.61 శాతం పోలింగ్‌ 

సాక్షి, అమరావతి: పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పునకు ప్రజలు ఓటేశారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పల్లె ప్రజలు జై కొట్టారు. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయబావుటా ఎగుర వేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సర్పంచ్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా ఏకపక్షంగానే సాగింది. దాదాపు 80.4 శాతం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు.

గ్రామ సచివాలయాల ద్వారా 524 రకాల ప్రభుత్వ సేవలను మారుమూల పల్లెల్లో సైతం అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించిన వైఎస్‌ జగన్‌ పాలన తీరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నట్టు ప్రజా తీర్పు వెలువడింది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయనందున అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,786 సర్పంచ్‌ స్థానాలకు శనివారం పోలింగ్, కౌంటింగ్‌ జరిగింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయపథాన దూసుకెళుతున్న సరళి విస్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద ఇదే వాతావరణం నెలకొంది.

81.61 శాతం పోలింగ్‌ 
రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.61 శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలై సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావం ఉంటుందని భావించిన దాదాపు 200 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్‌ జరిగింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక గ్రామాల్లో ఉదయమే ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌ జరగగా.. ఆఖరి గంట 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు కేవలం ఐదు శాతం ఓట్లు నమోదు కావడం గమనార్హం. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓటు వేసిన వారు చాలా కొద్ది మందేనని పోలింగ్‌ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. 

పోలింగ్‌ దాదాపు ప్రశాంతం
గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకట్రెండు స్వల్ప సంఘటనలు మినహా 13 జిల్లాల పరిధిలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తి ప్రశాంతంగా జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పోలింగ్‌కు ముందు కొందరు వ్యక్తులు బ్యాలెట్‌ పేపర్లును అపహరించుకుపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు అదనంగా బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి.. తెప్పించడంతో అక్కడ ఎన్నిక సజావుగా కొనసాగింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం ఇనిమెళ్లలో కొందరు రిగ్గింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు సమర్థవంతంగా అడ్డుకొని ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురం క్రిష్టాపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పొలింగ్‌ బూత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని ఎన్నికను సజావుగా నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన 9,661 చోట్ల పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి గిరిజాశంకర్‌ తదితర అధికారులు పోలింగ్‌ జరుగుతున్న తీరును వెబ్‌ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించారు. పోలింగ్‌ ముగిసిన రెండున్నర గంటల లోపే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఒట్ల లెక్కింపులో మొత్తం 48,929 మంది సిబ్బందిని వినియోగించినట్టు అధికారులు తెలిపారు. 

కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలకు ఆదేశం  
ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో అప్పటికే పొలింగ్‌ జరుగుతుండడం, కౌంటింగ్‌కు కూడా కేవలం రెండు మూడు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల రిటర్నింగ్‌ అధికారులు హడావుడి పడుతూ ఆ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top