రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోంది 

 YSRCP Samajika Sadhikara Yatra Public Meeting at - Sakshi

ఇది సీఎం జగన్‌ ఘనత

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యం 

పేదవారిని ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారు 

విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు 

దెందులూరు సామాజిక సాధికార సభలో మంత్రి రజిని 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందని, ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల సాధికారత సీఎం జగన్‌ ఘనతేనని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో జరిగిన సభలో మంత్రి రజిని మాట్లాడారు. సీఎం జగన్‌ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదవారిని ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన ఏకైక సీఎం జగన్‌ అని చెప్పారు.

ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఏలూరులోనూ రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వార్డు మెంబరు కావాలంటే పెత్తందారుల వద్ద ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని, ఆ స్ధితి నుంచి సీఎం జగన్‌ బయటకు తీసుకువచ్చి చట్ట సభల్లో  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ చెప్పారు.

రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలంతా కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగనన్నకు విజయం చేకూర్చాలని కోరారు. సీఎం జగన్‌ బయటకు రాకపోయినా ఆయన కటౌట్‌ను చూసి 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు జనం తరలివస్తున్నారని చెప్పారు. 

  • రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారి ఆశయాలను ఇప్పుడు సీఎం జగన్‌ నెరవేర్చారని చెప్పారు. దళిత కులంలో పుట్టాలనుకుంటారా.. అనే మాటలు గతంలో ఓ సీఎం నుంచి విన్నామని,  కానీ ప్రస్తుతం వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్న సీఎంను చూస్తున్నామని తెలిపారు. సీఎం జగన్‌ వల్ల దళిత, బలహీన వర్గాలకు ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ వంటి చదువులు అందుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పేకాటరాయుడు, అవినీతిపరుడు, దళిత ద్రోహి అని  ఆయన ధ్వజమెత్తారు. 
  • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. 2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో కేవలం ఆయనకు చెందిన వారికి మాత్రమే పనులు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం కులం, మతం, పార్టీ చూడటంలేదని, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసినవారికి, వేయనివారికి కూడా న్యాయం చేస్తున్నారని, కలెక్టర్ల సమావేశంలో కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జగన్‌ పాదయాత్రలో చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా చేశారన్నారు. నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. నిన్న హైదరాబాద్‌లో ఒక సామాజికవర్గ సమావేశం జరిగిందని, దానిలో ఎస్సీ, బీసీలు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు.  
  • గతంలో పేదలపై పెత్తనం జరిగేదని, ఇప్పుడు అదే పేదలకు పదవులు వస్తున్నాయని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. సీఎం జగన్‌ వల్ల పేద వర్గాలు చట్టసభల్లో అడుగుపెడుతున్నాయని, ఇందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. అక్రమ కేసులతో దళితులను జైళ్లలో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. దళితులు, బీసీలు, మై­నార్టీలు జైళ్ళలో కాదు చట్టసభ­ల్లో ఉండాలని భావించిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని తెలిపారు.  
  • ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, దెందులూరు గడ్డ వైఎస్సార్‌ సీపీ అడ్డాగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కవురు శ్రీనివాస్, జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్యేలు హఫీజ్‌ ఖాన్, మేకా వెంకట ప్రతాప అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ఎలీజా, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.  

విజయవాడలో ఏర్పాటు చేస్తున్న 
అంబేడ్కర్‌ విగ్రహం చూస్తుంటే అందరికీ ఒక విషయం అర్థం అవుతుంది. సీఎం వైఎస్‌ జగన్‌ బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక సాధికారత సాధిస్తున్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలు, ఆశయాలను నిజం చేస్తున్నారు. అందుకే.. తన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నారని అంబేడ్కర్‌ వేలు ఆ వైపు చూపిస్తున్నారు. – నందిగం సురేష్, ఎంపీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top