YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్‌ ఇవే..

YSRCP Plenary 2022: Highlights Of Resolution In Education Reforms - Sakshi

పోటీ ప్రపంచంలో విజయం సాధించేలా విద్యా సంస్కరణలు 

అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటివాటితో చదువులకు ఊతం 

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు 

3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌ 

పేదల పిల్లలు బాగుపడటం జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా గగ్గోలు 

విద్యా రంగంలో సంస్కరణలకు రూ.52,676.98 కోట్ల వ్యయం 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో విద్యా రంగంపై తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

చర్చించి ఆమోదం తెలిపిన సభ

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్‌ జగన్‌ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.
చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో  హైలైట్స్‌

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. 
గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు.

ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు.

హైలైట్స్‌
విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి 
రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు 
ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు 
 అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక 
ఇంగ్లిష్‌ మీడియం విద్య.. 
మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన 
రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం 
ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. 
మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే 
 ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు 
గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం 
 కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు  

పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు
అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్‌ జగన్‌ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు.  
– కిలారి రోశయ్య, ఎమ్మెల్యే 

నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు.  
– ఆదిమూలపు సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 

అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు 
ఇంగ్లిష్‌ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్‌ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు.  
– సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే 

బడుగుల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం వద్దా? 
రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్‌ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్‌ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. 
– నాగార్జున యాదవ్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top