శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారు?: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

YSRCP MPs Comments On Central Government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో పోలికలెందుకు? కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్సార్‌సీపీ ఎంపీల హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గురజాడ హాల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు డాక్టర్‌ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్‌.రెడ్డప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే కదా? అంటూ ప్రశ్నించారు.
చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్‌.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే..

కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ. శ్రీలంక జీడీపీ కన్నా, రాష్ట్ర జీఎస్‌డీపీ ఎక్కువ. వాణిజ్య ఎగుమతుల్లోనూ చాలా ముందున్నాం. ఏటేటా వాణిజ్య ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు.

అనుత్పాదక రంగాల్లోనే ఆ ప్రభుత్వం నిధుల వ్యయం. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు  గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దు’’ అని ఎంపీలు స్పష్టీకరించారు.

 వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..:

శ్రీలంకతో పోల్చడం సరికాదు:
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. మనది ఒక రాష్టం. శ్రీలంక ఒక దేశం. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయి. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేం. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరు. ఉదాహరణకు కొన్ని అంశాలు చూస్తే..

గణనీయంగా వాణిజ్య ఎగుమతులు:
శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019-20లో 19 బిలియన్‌ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020-21లో అవి 13 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2021-22లో 14 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ఇక్కడి నుంచి వాణిజ్య ఎగుమతుల మొత్తం 11 బిలియన్‌ డాలర్లు కాగా, అవి 2020-21లో 15 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ఆ తర్వాత ఏడాది 2021-22లో వాణిజ్య ఎగుమతుల మొత్తం ఏకంగా 25 బిలియన్‌ డాలర్లు. అంటే మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు 14 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. ఇక దేశ పరిస్థితి చూస్తే 2019-20లో 535 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా, 2020–21లో 500 బిలియన్‌ డాలర్లు, 2021–22లో దాదాపు 600 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి.

మన జీఎస్‌డీపీ బాగా మెరుగు:
అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నది వాస్తవం. రాష్ట్ర జీఎస్‌డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్‌డీపీ చాలా బాగుంది. శ్రీలంక జీడీపీ 81 బిలియన్‌ డాలర్లు కాగా, మన జీఎస్‌డీపీ 160 బిలియన్‌ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది.

కేంద్రం అప్పులు ఎక్కువ:
అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ. జీడీపీలో అప్పులు (డెట్‌ టు జీడీపీ) శ్రీలంకలో 101 శాతం ఉంటే, మన రాష్ట్రంలో చూస్తే అది 32.4 శాతం మాత్రమే. అదే కేంద్రంలో చూస్తే.. డెట్‌ టు జీడీపీ 59 శాతంగా ఉంది. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?. ఇవాళ కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిది. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. వాస్తవం ఇలా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఖండించాయి.

ప్రతి రూపాయికి లెక్క ఉంది:
రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అది జరిగింది. అదే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలను అనేక పథకాల ద్వారా ఆదుకున్నాం. నగదు బదిలీ ద్వారా వారు నిలదొక్కకోగలిగారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఒక్కో కుటుంబానికి కనీసం లక్ష నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అందింది.

అభివృద్ధి -సంక్షేమం:
ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోంది. ఇంక నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. విపక్షం ఇకనైనా విమర్శలు విడనాడాలి

పోలవరం బాధ్యత కేంద్రానిదే:
పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అయితే నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్లానింగ్, డిజైన్‌ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top