
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా క్యాడర్ అధికారులకు, పలువురు రాష్ట్ర అధికారులకు పోస్టింగ్‌లు, జీతాలు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ బీఆర్ గవాయ్‌లకు లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి. గత ఏడాది జూన్ నుంచి నలుగురు ఐపీఎస్‌లకు సహా 199 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం వెయిటింగ్‌లో ఉంచిందని లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.
వారికి ఏడాది కాలంగా జీతాలు చెల్లించడం లేదని, ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. వారికి పోస్టింగ్‌లు, జీతాలు ఇవ్వకుండా తీవ్రంగా వేధిస్తోందన్నారు. ఒకవైపు అధికారుల కొరత ఉందని చెబుతున్న ఏపీ ప్రభుత్వం.. చాలా మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదన్నారు. దీనిపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, సీజేఐలు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.


