పశుపోషకులకు బాసటగా.. | Sakshi
Sakshi News home page

పశుపోషకులకు బాసటగా..

Published Mon, May 20 2024 5:36 AM

ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదవశాత్తు గాయపడిన పశువుకు చికిత్స చేస్తున్న దృశ్యం

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ‘వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు’

పాడి రైతు గడప వద్దకు నాణ్యమైన పశు వైద్య సేవలు 

ఒక్క ఫోన్‌ కాల్‌తో మూగ జీవాలకు ఉచితంగా వైద్యం, మందులు

1962 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే గంటలోపే రైతు ముంగిట అంబులెన్స్‌లు

రెండేళ్లలో 8.81 లక్షల మూగజీవాలకు రక్షణ

రూ. 24.48 కోట్ల విలువైన మందుల పంపిణీ

7.55 లక్షల మంది పాడి రైతులకు మేలు

సాక్షి, అమరావతి: ఎవరైనా ఊహించారా మూగ­జీవాల కోసం అంబులెన్స్‌లు వస్తాయని, పాడి రైతు ఇంటి వద్దే ఆ మూగజీవాలకు వైద్యం అందుతుందని.. అయితే ఈ ఊహాతీతమైన విషయాన్ని నిజం చేసింది వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో తీసు­కొచ్చిన మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ పశుపోషకులకు వరంగా మారాయి. 

108 తరహాలోనే ఫోన్‌ చేసిన అరగంటలోనే పాడిరైతుల ఇంటి వద్దకు చేరుకుని వైద్యసేవలు అందిçస్తున్నాయి. పాడి రైతుల జీవనా«­దారాన్ని నిలబెడుతున్నాయి. ఈ వాహనాలు రోడ్డెక్కి రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే 8.81 లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపా­డగలిగాయి. ఏపీలోని సంచార పశు వైద్య సేవలపై కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్‌ బృందాలు అధ్యయనం చేశాయి. 

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఏపీలో సేవలను సమర్థంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈఎంఆర్‌ఐ) గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థకే ఆ రెండు రాష్ట్రాలు వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ మోడల్‌లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్‌ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సకాలంలో వైద్యసేవలందించడమే లక్ష్యం..
గతంలో పశువులకు అనారోగ్య సమస్య తలెత్తితే సుమారు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పాడి పశువులకు రైతుల ఇంటి ముంగిటే వైద్యసేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20వ తేదీన మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి 2 చొప్పున రూ. 210 కోట్లతో 340 అంబులెన్స్‌లను, ప్రత్యేకంగా 1962 కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమో సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్లను అందుబాటులో ఉంచారు. 

20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో సహా 33 రకాల పరికరాలతో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. ప్రథమ చికిత్సతో పాటు చిన్న తరహా శస్త్రచికిత్సలు, కృత్రిమ గర్భధారణ లాంటి సేవలకు ప్రతీ వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వాహనాల ద్వారా 295 పశువైద్యులు, 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. 

పశువులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనంలో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యాన్ని కల్పించారు. వైద్య సేవల అనంతరం తిరిగి ఇంటి వద్దకే తీసుకొచ్చి అప్పగించేలా ఏర్పాటు చేయడంతో రైతులకు వ్యయ ప్రయాసలు, రవాణా భారం తొలగిపోయాయి. 1962 కాల్‌ సెంటర్‌కు నిత్యం సగటున 1778 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ వాహనాలు మండలానికి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11,987 మారుమూల గ్రామాలకు చేరుకుని వైద్య సేవలందించాయి. సుమారు రెండేళ్లలో రూ. 24.48 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 7,55,326 మంది పశుపోషకులకు జీవనోపాధిని కాపాడగలిగారు.

⇒ బాపట్ల జిల్లా రామకృష్ణ నగర్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లుకు ఆరు పాడి గేదెలున్నాయి. ఓ పశువు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో కదల్లేని స్థితిలో కూలబడిపోయింది. ఉదయం 9.40 గంటలకు 1962కి కాల్‌ చేయగా 10.30 నిమిషాలకు అంబులెన్స్‌ ఇంటికే వచ్చింది. నొప్పి నివారణకు డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే కోలుకుని లేచి నిలబడగలిగింది. ఇప్పటివరకు మనుషుల కోసమే అంబులెన్స్‌ వస్తుందనుకున్నాం. మూగ జీవాలను సైతం సంరక్షిస్తూ ఉచితంగా మందులు కూడా అందించే సౌకర్యం కల్పించిన సీఎం జగన్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

నిజంగా గొప్ప ఆలోచన..
నాకు ఐదు పాడి ఆవులున్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కి ఫోన్‌ చేయగా గంటలో అంబులెన్స్‌ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులిచ్చారు. గతంలో పశువైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇంటి వద్దే జీవాలకు సేవలందించడం నిజంగా గొప్పఆలోచన. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.   
 –కాటి విద్యాసాగర్, కోతపేట, బాపట్ల జిల్లా

అరగంటలోనే అంబులెన్స్‌..
మాకు రెండు పాడి గేదెలు, నాలుగు సన్న జీవాలున్నాయి. మేతకు వెళ్లిన ఓ గేదెకు కాలు చీరుకుపోవడంతో నడవలేక పోయింది. 1962కు కాల్‌చేస్తే అరగంటలో అంబులెన్స్‌ వచ్చింది. పశువు కాలుకు డ్రెస్సింగ్‌ చేసి బ్యాండేజ్‌ కట్టారు. నొప్పికి ఇంజక్షన్‌ ఇచ్చారు. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– ఎం.అసిరిరెడ్డి, దళ్లిపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా

మాబోటి రైతులకు ఎంతో మేలు..
నాకు 12 ఆవులున్నాయి. ఓ ఆవు కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడింది. 1962కి కాల్‌ చేశా. వెంటనే అంబులెన్స్‌ వచ్చింది. డాక్టర్‌ చికిత్స అందించారు. ఆవు కోలుకొని నిలబడేలా చేశారు. మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల ఏర్పాటు ఆలోచన చాలా బాగుంది. మాబోటి పేద రైతులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. 
– పర్రి ఉమా మహేశ్వరరావు, పర్రిపుత్రుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా   

Advertisement
 
Advertisement
 
Advertisement