YSR Cheyutha: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

వైఎస్సార్ చేయూత దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది 45 ఏళ్ల వయసు నిండి అర్హత పొందిన మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45–60 మధ్య వయసున్న మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంలో ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది.
చదవండి: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు
ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా మహిళలకు రూ. 9,179.67 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 22వ తేదీన వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని తొలుత గడువు నిర్ధారించగా దానిని ఏడవ తేదీ వరకు పొడిగించారు. తాజాగా ఆ గడువును మళ్లీ ప్రభుత్వం పొడిగించింది.