దశాబ్దానికి ఒక్కడు.. భవిష్యత్‌ స్వాప్నికుడు | Remembering YSR On His 77th Birth Anniversary, The Visionary Leader Who Transformed Nellore Through Water And Welfare | Sakshi
Sakshi News home page

YSR Jayanthi 2026: దశాబ్దానికి ఒక్కడు.. భవిష్యత్‌ స్వాప్నికుడు

Jul 8 2026 7:54 AM | Updated on Jul 8 2026 10:04 AM

YS Rajasekhara Reddy 77th Birth Anniversary

తరతరాల చరితం.. జ్వలించే జీవితం ఆయనది. రాజకీయ యవనికపై దశాబ్దానికి ఒకే ఒక్కడుగా అవతరించాడు. సంక్షేమ సంతకంతో కొన్ని తరాల జీవితాలనే మార్చేసిన పాలికుడు. ఆకాశ గంగను పుడమిపైకి తెచ్చిన అపరభగీరథుడు. వర్షపు నీటిని ఒడిసి పట్టి బంజరు భూములకు మళ్లించి బంగరు భూములుగా మార్చిన జలయజ్జికుడు. భావితరాల భవిష్యత్‌ను కాంక్షించి.. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడు. పదిహేడేళ్ల క్రితం ఆశే నింగికెగసింది.. నిరాశే మిగిలింది. జిల్లా ప్రజల మదిలో రాజన్న స్థానం పదిలం. బుధవారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  డాక్టర్‌ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 5 ఏళ్ల 3 నెలల పరిపాలన తరతరాలుగా చెరగని సంతకం. దశాబ్దన్నర క్రితం ఒక రాష్ట్రం తన నాయకుడిని కోల్పోయింది. కోట్లాది ప్రజల గుండెల్లో ఆశలను నింపిన గుండె ఆగిపోయింది. ప్రతి క న్నీటి చుక్క ఒక జ్ఞాపకమైంది. ప్రతి హృదయం శూన్యమైంది. సంక్షేమం, అభివృద్ధితో తరతరాల జీవితాల ను ఉజ్వలం చేశారు. ఆ కోవలోనే జిల్లాలో వైఎస్సార్‌ దూరదృష్టితో చేసిన అభివృద్ధి, వేసిన బీజాలు, అందించిన సంక్షేమం అజరామరంగా నిలిచిపోయాయి.   
భవిష్యత్‌ స్వాప్నికుడు 
దివంగత వైఎస్సార్‌ ఆనాడే ఐదేళ్ల పాలనలో ఐదు తరాల భవిష్యత్‌కు పునాదులు వేశారు. విద్యను పేదవాడి హక్కుగా, వైద్యాన్ని ప్రతి కుటుంబానికి భరోసాగా, వ్యవసాయాన్ని అన్నదాత ఆత్మగౌరవంగా, పారిశ్రామికాభివృద్ధిని యువత భవిష్యత్‌కు పునాదిగా మలిచిన దూరదృష్టి కలిగిన స్వాప్నికుడు. సంక్షేమాన్ని ప్రభుత్వ విధానంగా కాక, సామాజిక న్యాయానికి ప్రతీకగా కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన పాలకుడు.   

మేఘమథనం చేసి.. గంగను ఒడిసి పట్టి.. 
కరవు రక్కసి వేళ మేఘమథనం చేసి.. ఆకాశ గంగను నేలపైకి తెచ్చి అపర భగీరథుడయ్యారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి సోమశిలకు మళ్లించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెన్నార్‌ డెల్టాతోపాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేశారు. సోమశిల ప్రాజెక్ట్‌ ద్వారా అదనంగా 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చారు.   

సంగం బ్యారేజ్‌ నిర్మాణంతో.. 
జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీకి శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు నిర్లక్ష్యం వహించడంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించి ప్రజలకు అంకితం చేశారు.   

పెన్నా బ్యారేజ్‌తో..  
2008లో పెన్నాబ్యారేజ్‌ రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్‌ని నిర్మించారు.

మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయ వనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు.  

సమగ్ర సోమశిల సహకారం  
అన్నపూర్ణగా విలసిల్లిన సింహపురి.. దాదాపు మూడు దశాబ్దాలపైకుపైగా నిర్లక్ష్యానికి గురై కరువు కోరల్లో చిక్కి విలవిలలాడున్న తరుణంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు వందల రూ.కోట్లతో సమగ్ర సోమశిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడయ్యారు. జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏటా 35 నుంచి 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ముంపు పరిహారంలో నెలకొన్న జాప్యం, అటవీశాఖ అనుమతులు లభించని పరిస్థితిపై దృష్టి సారించారు. సమగ్ర సోమశిలకు అడ్డంకిగా ఉన్న వైఎస్సార్‌ జిల్లా ఎగువరాచపల్లి గ్రామానికి యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించి ఖాళీ చేయించి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీల వరకు పెంచి కర్షకుల కలలను సాకారం చేశారు. ఇందులో భాగంగా సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను అభివృద్ధి చేసి అక్కడి బంజరు భూములను బంగరు భూములుగా మలిచారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement