
రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో వైఎస్ జగన్
లంచాలు లేని పాలన చేశాం
మేనిఫెస్టో అనేది చెత్త బుట్ట కాదని.. అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి చాటిచెప్పాం
కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా పథకాలు డోర్ డెలివరీ చేశాం
విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేశాం
చంద్రబాబు తన అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారు.. ఆ మోసం ప్రజల్లో కోపాగ్నిగా మారుతోంది
బాబుకు ఘోర పరాజయం తప్పదు
ఇవాళ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. విద్య, వైద్య రంగాలను నాలుగు నెలల్లోనే నాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని పేదవాడు వెళితే వైద్యం చేస్తారన్న నమ్మకం లేని పరిస్థితి. దాదాపు రూ.2,400 కోట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. చదువుకునే పిల్లలు విద్యాదీవెన, వసతి దీవెన కోసం ఎదురు చూస్తున్నారు.
రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసినా పెట్టుబడి సహాయం లేదు. ఆర్బీకేలు లేవు. ధాన్యం కొనుగోలులో మళ్లీ దళారులు వచ్చారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. ఏ పథకమూ డోర్ డెలివరీ లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు వెళ్తేనే వాళ్ల సమక్షంలో పథకాలు ఇచ్చే పరిస్ధితి. అక్కడకు వెళ్లకపోతే పథకాలు నిలిచిపోతాయి. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారు.
మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. ప్రతి ఇంట్లో బతికే ఉంది. మన కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరు. చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామంలో ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి. పిల్లలు రూ.15 వేల గురించి అడుగుతారు. మహిళలు రూ.18 వేల గురించి అడుగుతారు. పెద్ద వాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు. రైతులు రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఏమని సమాధానం చెబుతారు?
ఇప్పుడు రెడ్‌బుక్ పాలన సాగుతోంది. ప్రజలను భయపెడుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది. అన్ని వ్యవస్ధలు కూలిపోయాయి. అంతులేని అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం పది పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి.
మద్యం అమ్మకాలు పెంచే కార్యక్రమం నడుస్తోంది. డిస్టిలరీస్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. లిక్కర్ సిండికేట్స్ అప్పుడే మొదలయ్యాయి. గ్రామ గ్రామాన బెల్టు షాపులు ప్రమోట్ చేసే కార్యక్రమం నడుస్తోంది. ఇసుక గురించి మాట్లాడలేని పరిస్థితి. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇవాళ ఉచితం లేదు కానీ, రెట్టింపుకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : ‘ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పారు. ప్రజలను మోసం చేశారు. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఇంటికీ మంచి చేసిన మనకే ఇలా అయితే.. ప్రజలను ఇంతలా మోసం చేసి, అన్నీ అబద్ధాలే చెప్పిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు? ఆయన ప్రజలను ఎన్ని రోజులు భయపెడతారు? ఎన్ని రోజులు కేసులు పెడతారు? ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే చంద్రబాబుకు పరాజయం తప్పదు.
టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరు. ఇది నిజం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ ఉందన్నారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఎత్తిచూపుతూ.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని.. ఇది సృష్టి ధర్మమని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఉద్బోధించారు. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష అని.. మన వ్యక్తిత్వమే మనల్నిముందుకు నడిపిస్తుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రేపల్లె నియోజకవర్గంలోని స్థానిక సంస్థలప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఐదేళ్లు గర్వంగా తలెత్తుకునేలా పాలన
» 2019 నుంచి 2024 వరకు మనం గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం. ‘నేను వైఎస్సార్‌సీపీ కార్యకర్తను’ అని ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటికి వెళ్లి గర్వంగా చెప్పుకునేలా మన పాలన సాగింది. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగింది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి తొలిసారిగా మన పార్టీ మాత్రమే చెప్పింది. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పబోమని వాటిని నెరవేరుస్తూ అడుగులు వేశాం.
» మొట్టమొదటి బడ్జెట్‌లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా పథకాలన్నీ అమలు చేశాం. మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరింది. మనకు ఓటు వేశారా.. లేదా అన్నది చూడలేదు. కులం, మతం కూడా చూడకుండా పథకాలు డోర్ డెలివరీ చేసి అండగా నిలబడ్డ ప్రభుత్వం మనది.
» కోవిడ్ వంటి సంక్షోభం సమయంలో ఆదాయం తగ్గి.. ఖర్చు పెరిగినప్పటికీ ఏ పథకాన్నీ ఆపలేదు. ఎలాంటి సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. పైగా, అంతకు ముందు చంద్రబాబు చేసిన అప్పుల భారం కూడా మన మీద పడింది. దాదాపు రూ.20 వేల కోట్ల కరెంటు బిల్లులు వదిలిపెట్టి వెళ్లారు. అయినా తొలిసారిగా డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా ప్రజలకు మేలు చేయొచ్చని రుజువు చేశాం. అది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది.
గణేష్ మీ మనిషి
» మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఏరోజైనా మంచే చేశాం. తాను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేశాం. అంతటితో మర్చిపోకుండా మంత్రి పదవి ఇచ్చి కేబినెట్‌లో పెట్టుకున్నాను. మండలిని రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవి పోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపాం. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీది. మనం ఆయనకు ఎక్కడా తక్కువ చేయలేదు.
» ఇప్పుడు గణేష్ కు మీ మద్దతు చాలా అవసరం. మంచి వాడు. కార్యకర్తకు ఏంజరిగినా నా దృష్టికి తీసుకొస్తాడు. గణేష్ లో ఆ మంచి గుణం ఉంది. ఆయన మీలో ఒకడు. మీ నుంచి వచ్చిన వాడు. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యం. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు. నన్నే ఉదాహరణగా తీసుకోండి. మా నాన్న ముఖ్యమంత్రి. అయినా కష్టాలు వచ్చాయి. పెద్ద వాళ్లంతా ఏకమయ్యారు. తప్పుడు కేసులు పెట్టారు. ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టారు. వేధించారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించ లేదా? మంచి చేసే మనసు ఉన్నప్పుడు, ఆ మంచి వైపు దేవుడు తప్పకుండా ఉంటాడు. ఈ విషయాన్ని కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి.
కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
» విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. స్కూళ్లలో ఎప్పుడూ చూడని మార్పులు చేశాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో స్కూళ్ల మార్పులు, సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్ క్లాసులు, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు వచ్చింది కూడా మన ప్రభుత్వమే.
» మనం అధికారంలోకి రాక ముందు కేవలం వెయ్యి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3,350 ప్రొసీజర్లకు పెంచాం. ఏకంగా పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధి పెంచాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం. జీఎంపీ ప్రమాణాలున్న మందులు ఇచ్చాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఊళ్లలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. అక్కడే 105 రకాల మందులు, 14 రకాల టెస్టులు చేసే విధంగా ఆరోగ్య సురక్ష అందుబాటులోకి తెచ్చాం.
» వ్యవసాయ రంగంలో ఉచిత పంటల బీమా కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అమలైంది. రైతులకు పెట్టుబడి భరోసా పక్కాగా అమలు చేసింది మన ప్రభుత్వం మాత్రమే. మొదటిసారిగా ఈ–క్రాపింగ్, ఆర్బీకేలు, రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాం. అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం.
వాళ్లు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి
వాళ్లు అబద్ధాలు చెప్పి మోసంతోనే ప్రచారం చేశారు. వలంటీర్లను తీసేయబోమని, వారికి రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నా.. పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వారి తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు అని, 50 ఏళ్లకు పైబడిన మహిళ కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, కండువాతో రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి అబద్ధాలతో మోసం చేశారు. ఒకవేళ నేను కూడా అలాంటి అబద్ధాలు చెప్పి ఉంటే, ఈరోజు సీఎం స్ధానంలో ఉండేవాడిని. కానీ, మీలో ఎవరైనా ఇవాళ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేదా?