ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్‌

YS Jagan Released YSR Uchitha Pantala Bheema Funds In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.

రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్‌ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు.  గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు.

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని, తాము వచ్చాక ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి అని, 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందజేశారని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేశారని పేర్కొన్నారు. 15.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 30 రకాల పంటలకు ఇన్సూరెన్స్ వస్తుందని వివరించారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పంటల బీమా పథకం కింద 21 రకాల పంటలకు బీమా కల్పిస్తోంది. 9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్‌- 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి రైతులకు అండగా నిలిచింది.
చదవండి: రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top