
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
కాగా అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో.. కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాషువా, భవాని, శ్రద్ధ మరణించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి ఏరియా ఆసుప్రతిలో 17 మంది విద్యార్ధులకు చికిత్సం అందిస్తుండగా.. నర్సీపట్నం ఆసుపత్రిలో ఏడుగురు విద్యార్ధులకు చికిత్స పొందుతున్నారు.
