14న 5 వైద్య కళాశాలల ప్రారంభం 

Ys Jagan Mohan Reddy lays foundation for 5 new medical colleges in Andhra pradesh - Sakshi

లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 

సీఎం జగన్‌ చేతుల మీదుగా విజయనగరం కళాశాల ప్రారంభం 

అక్కడి నుంచి వర్చువల్‌గా మిగతా 4 కళాశాలలు ప్రారంభం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ ద్వారా ఆల్‌ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్‌ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. 

వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు 
విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్‌ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.   – మురళీధర్‌ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్‌ఐడీసీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top