
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు
మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఆంక్షల మధ్య అరకొరగా అమలు
ఆ చిన్న హామీని సైతం చెప్పినట్టుగా అమలు చేయకుండా మోసం
ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలు.. గత ఏడాది జూన్ నుంచే అమలు చేస్తామని హామీ
తీరా 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన
11,256 బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఉచితం
ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు.. 950 నాన్‌స్టాప్ బస్సులకు వర్తించదని బోర్డులు
పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారులైపోతారన్నట్లు మోసపుచ్చే మాటలు
ఇది అక్కచెల్లెమ్మలను మోసం చేయడం కాదా? దగా కాదా?
మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు
రెండేళ్లకు గాను ఒక్కొక్కరికి రూ.30 వేలకు గాను ఇచ్చింది రూ.13 వేలే
87 లక్షల మంది పిల్లలకు గాను 30 లక్షల మందికి కోత పెట్టారు
ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అంటూ ఒక్కదానికే నిధులా?
మా ప్రభుత్వంలో అమలైన పథకాలన్నింటినీ రద్దు చేసి మహిళలను పేదరికంలోకి నెట్టారు
2014–19 మధ్య మీ మోసాలన్నింటినీ మరోసారి చర్చించుకుంటున్నారు
మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి.. ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ మహిళలందరినీ నమ్మించి.. గత ఏడాది జూన్ నుంచే వాటిని అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి.. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తకుండా వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి.. హామీలకు కోతలు పెడుతున్నారు.. ఇది మోసం కాదా? దగా కాదా? అంటూ నిలదీశారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
⇒ చంద్రబాబు గారూ.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్ –7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచారు. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.
⇒ ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?
⇒ చంద్రబాబు గారూ.. మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014–19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరకు వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు.
⇒ మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు.
⇒ చంద్రబాబు గారూ.. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బ తీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?
⇒ మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చాం. అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం.
ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్త శుద్ధికి నిదర్శనం.
⇒ మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ!