మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట | YS Jagan fires on Chandrababu Over Attack on Uppala Harika | Sakshi
Sakshi News home page

మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట

Jul 13 2025 6:30 AM | Updated on Jul 13 2025 6:38 PM

YS Jagan fires on Chandrababu Over Attack on Uppala Harika

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌   

కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై దాడి చేయించడం దుర్మార్గం 

మీ పచ్చ సైకోలతో పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేయించడం గొప్ప పనా? 

దీన్ని పరిపాలన అనరు.. శాడిజం, పైశాచికత్వం అంటారు 

ఆమె ఏం తప్పు చేసింది? ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా?  ఇదేమైనా తప్పా? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వచి్చంది?  

అందులోనూ మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ నిస్సిగ్గుగా దాడి చేశారు  

 వైఎస్సార్‌సీపీ నేతలపై, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై దొంగ కేసులు పెడుతున్నారు 

ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వంలో ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి?

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. మహిళల మీద మీ దాడి మీ శాడిజంకు పరాకాష్ట’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశారని బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై గుడివాడలో మీ వాళ్లను పంపి దాడులు చేయించారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘మహిళల మీద ఈ రోజు మీ దాడి, మీ శాడిజంకు పరాకాష్ట. వైఎస్సార్‌సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు.. చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని.. చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెబితే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చ సైకోలతో మీరు దాడులు చేయించడం గొప్ప పనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు? పైగా పోలీసుల సమక్షంలోనే వారు దుర్భాషలాడుతూ దాడి చేశారు.

చంద్రబాబూ.. దీన్ని పరిపాలన అనరు. శాడిజం అంటారు.. పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లను ఎందుకు హౌస్‌ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అని కూడా చూడకుండా, దుర్భాషలాడుతూ సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు.  

ఇది పైశాచికత్వం కాదా? 
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడం లేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్‌లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారు. దాడి చేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే కానీ, వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు.. అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా?  

రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తారా?  
చంద్రబాబూ.. మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారు. వీళ్లే కాకుండా సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతో మంది అమాయకులను కేసుల్లో ఇరికించారు.. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీకి చెందిన వందల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులపైన, వందల మంది సోషల్‌ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టి వారిని హింసించారు.. తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచి్చన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.

సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటన  
కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన గూండాలు కలిసి జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి తెస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు? పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది.     – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌  

రెడ్‌బుక్‌ పాలనకు పరాకాష్ట  
కూటమి అధికారం చేపట్టాక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కూటమి రెడ్‌బుక్‌ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.  – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం

హారికపై టీడీపీ గూండాల దాడి హేయం 
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు గుడివాడలో దాడికి పాల్పడటం హేయమైన చర్య. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి అమానుష దాడులను సహించేది లేదు.  – జోగి రమేష్, మాజీ మంత్రి

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు  
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళా ప్రజాప్రతినిధులను సైతం మానసికంగా వేధించడమే కాకుండా భౌతికంగా దాడులకు కూడా బరితెగించడం అన్యాయం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఈ రకమైన దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు.     – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ 

ఏం నేరం చేశారని ఉప్పాల హారికపై గుడివాడలో దాడులు చేయించారు? : వైఎస్ జగన్



ఆటవిక పాలన సాగుతోంది 
రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారింది. జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై దాడి హేయం. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే.. అదే చివరి రోజవుతుందన్న చంద్రబాబు టీడీపీ గూండాలు రెచి్చపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు.  
 – ఆర్‌కే రోజా, మాజీ మంత్రి  

పోలీసులు చోద్యం చూస్తున్నారు  
మహిళా ప్రజాప్రతినిధి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేయడం దారుణం. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం అంటే.. ఆ హోం మంత్రి పదవిలో ఉండటం అనవసరం. పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు.    – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి 

రాష్ట్రంలో సైకోపాలన 
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సైకో పాలన నడుస్తోంది. గుడివాడలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల మాటున పచ్చ సైకోలు బీసీ కులానికి చెందిన, ఉన్నత చదువులు చదువుకుని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిలో ఉన్న ఉప్పాల హారికపై దాడికి తెగబడటం దారుణం.  ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు.      – పేర్ని నాని, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు

దారుణమైన పాలన  
చంద్రబాబు ప్రజలకిచి్చన వాగ్దానాల అమలులో విఫలమై డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.      – విడదల రజిని, మాజీ మంత్రి    
 
పోలీసుల సాక్షిగా ఉన్మాద దాడి  
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు? ఈ దాడికి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడేం సమాధానం చెబుతారు? మహిళా హోం మంత్రి అనిత ఎందుకు నోరు మెదపడం లేదు?      – ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి    

రాష్ట్రంలో రాక్షస పాలన 
సీఎం చంద్రబాబు  రాక్షస పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.      – పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి 

సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? 
జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై జరిగిన దాడి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని స్పష్టం చేస్తోంది. బీసీ మహిళపై చేసిన దాడిని కచి్చతంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నరసేపు మీటింగ్‌కు రానివ్వకుండా రోడ్డుమీద ఆపేసి, కారు అద్దాలు పగులగొట్టడం అమానుష చర్య. జిల్లా ప్రథమ పౌరురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..?      – ఆరె శ్యామల, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

మహిళ దుస్థితికి ఈ ఘటన అద్దం పట్టింది 
కూటమి పాలనలో మహిళల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మహిళలపై దారుణాలకు కూటమి నేతలు తెగబడుతున్నారు. ఈ దాడికి కూటమి కార్యకర్తలను ఎగదోసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను బీసీ వర్గాలు క్షమించవు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు.     – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement