
తాడేపల్లి: గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచి్చన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.
కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు.

ఒకరిని కాపాడబోయి వరుసగా..
కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్‌కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.


గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే..
విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు çఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు.

గ్రామస్తుల ఆగ్రహం..
ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు.