
జాతీయ స్థాయిని మించి ఏపీ యువత సామర్థ్యం
88.8 శాతంతో కేరళ తొలిస్థానం.. 88.4 శాతంతో తెలంగాణ రెండో స్థానం.. మూడో స్థానంలో ఏపీ
దేశ సగటు 68.0 శాతమైతే ఏపీలో ఇది 85.3 శాతం
15–24 ఏళ్లలోపు యువతీ యువకులపై సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికాం–2025 వెల్లడి
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులు జాతీయ సగటును మించి ముందున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 15–24 సంవత్సరాల్లోపు యువతలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించగల సామర్థ్యం ఎంత శాతం మందికి ఉందనే వివరాలను కేంద్ర గణాంకాల, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమగ్ర మాడ్యులర్ సర్వే:టెలికాం–2025 వెల్లడించింది.
కంప్యూటర్ లేదా మొబైల్ వంటి పరికరాలతో లావాదేవీలు నిర్వహించే సామర్థ్యంపై ఈ సర్వే జరిగింది. ఇందులో.. రాష్ట్ర గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత మిగతా చాలా రాష్ట్రాల కంటే ముందున్నట్లు తేలింది. కేరళ తొలిస్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోనూ ఉంది. కేరళలో 88.8 శాతం మంది.. తెలంగాణలో 88.4 శాతం, ఏపీలో 85.3 శాతం మందికి ఈ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడంలో సామర్థ్యం ఉంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..
ఇక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల పురుషుల్లో 89.7 శాతం.. మహిళల్లో 77.3 శాతం మందికి ఈ సామర్థ్యం ఉంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఇది 83.6 శాతంగా ఉంది. అదే జాతీయ స్థాయిలో చూస్తే.. గ్రామీణ ప్రాంతాల పురుషుల్లో 73.3 శాతం, మహిళల్లో 51.4 శాతంగా ఉంది. మొత్తం మీద జాతీయ స్థాయిలో గ్రామాల్లోని మొత్తం 62.7 శాతం మంది యువతకు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో సామర్థ్యం ఉంది. మరోవైపు.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 90.5 శాతం పురుషులకు.. మహిళల్లో 87.0% మందికి ఈ సామర్థ్యం ఉంది. మొత్తం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చూస్తే 88.6 శాతం యువత ఈ విషయంలో సమర్థులుగా తేలింది.
రాష్ట్రంలో జాతీయ సగటును మించి..
జాతీయ సగటు విషయానికొస్తే.. 60.5 శాతం మంది పురుషులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సామర్థ్యం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 66.6 శాతంగా ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో 37 శాతం మహిళలకు.. ఆంధ్రప్రదేశ్‌లో 43.2 శాతం మహిళలకు ఈ సామర్థ్యం ఉంది. మొత్తం కలిపి జాతీయ స్థాయిలో యువతకు 48.9 శాతం మందికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సామర్థ్యం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 54.6 శాతంగా ఉంది.