
పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో డెంగీ లక్షణాలతో ఓ యువతి ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని తుఫాన్ కాలనీకి చెందిన పెద్ది రూప (23) కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటోంది. నెల క్రితం ఆమె గ్రామానికి వచ్చింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. జ్వరం తగ్గకపోవటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగీ సోకిందని నిర్థారించి చికిత్సచేశారు.
ఆరోగ్యం కుదుట పడకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి 3 రోజుల క్రితం తరలించగా..చికిత్స పొందుతూ ఆదివారం రూప మృతి చెందినట్లు ఆమె తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అయితే రూప రిపోర్టుల్లో డెంగీ నెగటివ్‌గా ఉందని, వైరల్ జ్వరంతో పాటు వీక్‌గా ఉండటంతో అవయవాలు దెబ్బతిన్నాయని, జ్వరానికి హైడోస్ మందులు కూడా వాడారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. తుఫాన్ కాలనీలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారని వైద్యాధికారి డాక్టర్ నాగలక్ష్మి తెలిపారు.