
రంపచోడవరం: సచివాలయ మహిళా ఉద్యోగిని అపహరించుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. శరభవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సోయం శ్రీసౌమ్య ఉదయం 10.30 గంటలకు రోజూ మాదిరిగా విధులకు హాజరయ్యారు.
ఈ క్రమంలో వేటుకూరుకి చెందిన కె.అనిల్‌కుమార్ మరికొందరి సహాయంతో AP31TJ1462 నంబరు గల ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించి, బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకుని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు నాలుగు రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందూ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.